తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో!

లాక్‌డౌన్‌ వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆహారం, బస వివరాలు తెలుసుకోలేని వారి కోసం టెక్‌ దిగ్గజం గూగుల్‌ సాంకేతిక సాయం అందిస్తోంది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో భోజనం, బస ఎక్కడ దొరుకుతాయో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Google Maps now shows food, night shelters details across 30 cities
ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో..

By

Published : Apr 6, 2020, 7:16 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లకుండా నగరాల్లోనే చిక్కుపోయారు. వారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారం, బస కల్పిస్తున్నాయి. అయినప్పటికీ వీటిని పొందలేకపోతున్న వారికోసం టెక్‌ దిగ్గజం గూగుల్‌ సాంకేతిక సాయం అందజేస్తోంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 30 నగరాల్లో భోజనం, బస ఎక్కడ దొరుకుతాయో చూపించనుంది. సహాయ కేంద్రాల వివరాలు చూపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

'ఇప్పటినుంచి మ్యాప్స్‌, సెర్చ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా దేశంలోని 30 నగరాల్లో సహాయ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు' అని గూగుల్‌ తెలిపింది. ప్రజలు 'ఫుడ్‌ షెల్టర్స్‌ ఇన్‌ <సిటీ నేమ్‌>' లేదా 'నైట్‌ షెల్టర్స్‌ ఇన్‌ <సిటీ నేమ్‌>' అని టైప్‌ చేసి వివరాలు పొందొచ్చని వెల్లడించింది. త్వరలోనే ఈ సేవలు హిందీలోనూ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మరిన్ని నగరాలు, భారతీయ భాషల కోసం పని మొదలుపెట్టినట్టు వెల్లడించింది.

'కొవిడ్‌-19తో విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ కష్ట సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు గూగుల్‌ దృష్టిసారించింది. స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి ఆహారం, బస గురించి వాలంటీర్లు, ఎన్‌జీవోలు, ట్రాఫిక్‌ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సాయపడాలని కోరుతున్నా' అని గూగుల్‌ ఇండియా సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అనాల్‌ ఘోష్‌ అన్నారు. ప్రస్తుతానికి ఏయే నగరాల్లో గూగుల్‌ సేవలు లభిస్తున్నాయో తెలియాల్సి ఉంది. చైనాలో మొదట వెలుగుచూసిన కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details