గత ఏడాది భారీ సంపదను పోగేసి రికార్డు సృష్టించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. గడిచిన వారం రోజుల్లో చతికిలపడ్డారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన సంపద ఏకంగా 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2లక్షల కోట్లు) మేర కరిగిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం 156.9 బిలియన్ డాలర్ల(రూ.11.5 లక్షల కోట్లు) సంపదతో ఆయన ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ కంటే మస్క్ సంపద 20 బిలియన్ డాలర్లు(రూ.1.46లక్షల కోట్లు) తక్కువగా ఉంది.
కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో గత నాలుగు వారాల్లో మస్క్ సంపద ఊహించిన దానికంటే భారీగా దిగజారుతూ వచ్చింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ నాలుగు వారాల్లో 230 బిలియన్ డాలర్ల(రూ.16.8లక్షల కోట్లు) మేర పడిపోయింది. ఈ ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పతనమైంది. 2019 మే తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికాలో బాండ్ల మార్కెట్ల వల్ల నెలకొన్న ప్రతికూలతలే టెస్లా షేర్ల పతనానికి కారణమైంది.