మరో జలదృశ్యానికి కన్నెపల్లి సిద్ధం తెలంగాణ ప్రజల వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో 6వ ప్యాకేజీ పనుల్లో భాగంగా నిర్వహించిన వెట్ రన్ విజయవంతమై గంగమ్మ పరవళ్లు పెట్టింది. అద్భుత చరిత్రాత్మక జలదృశ్యం అందరి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఉప్పొంగి నింగినంటిన గోదారి జలాలు...భవిష్యత్ తెలంగాణ సస్యశ్యామల చిత్రాన్ని కనిపించేలా చేశాయి.
మే 8 న ముహూర్తం
ఇప్పుడు మరో జల దృశ్యానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మితమైన కన్నెపల్లి పంప్ హౌజ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వెట్ రన్ నిర్వహణకు సన్నాహాలు చేస్తూ పనులను మరింత వేగవంతం చేస్తున్నారు. మే 8న...ఉదయం 10 గంటల 41 నిమిషాలకు... వెట్ రన్ నిర్వహించేలా ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఒకే రోజు రెండు పంపుల వెట్ రన్ నిర్వహించనున్నారు.
స్మితా సబర్వాల్ ప్రత్యేక పరిశీలన
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయటానికి తరచూ కాళేశ్వరం విచ్చేసి...సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా... చేయాల్సిన పనులకు నిర్ణీత గడువును నిర్దేశిస్తున్నారు.
6 పంపులు సిద్ధం
వెట్ రన్‌కు ముహూర్తం కుదరడం... మరో పది రోజులే గడువు ఉండటంతో అధికారులు మిగిలిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్ అత్యంత కీలకం. ఇందులో మొత్తం 11 పంపులకు గాను... 8 పంపులు బిగించగా...6 పంపులు పూర్తిగా వెట్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయి. వెట్ రన్ ద్వారా నీటిని కన్నెపల్లి అన్నారం గ్రావిటీ కెనాల్లో ఎత్తిపోసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావటంతో గోదావరి ప్రాణహిత నీటి ప్రవాహం తగ్గింది. వెట్ రన్ నిర్వహించాలంటే పంప్ హౌస్‌లోని ఫోర్ బేను నీటితో నింపాల్సి ఉంటుంది. ప్రవాహం నుంచి నేరుగా ఫోర్ బేలోకి నీరు వచ్చే విధంగా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇది కేవలం ఒక రోజులో ముగిసే పని కావడంతో వెట్ రన్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
శరవేగంగా గేట్ల బిగింపు
ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ పనులు కూడా ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. మేడిగడ్డలో 85 గేట్లకు గాను 61 గేట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా 24 గేట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అన్నారం బ్యారేజీ 66 గేట్లు బిగింపు పూర్తైంది. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేసుకుని... బీడు భూములను బంగారు భూములుగా మార్చి...యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేసే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి.
ఇవీ చూడండి:కాళేశ్వరం పురోగతిని పరిశీలించిన స్మితా సబర్వాల్