రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాలలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
జలమయమైన రహదారులు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. కూకట్‌పల్లి, మల్లాపూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం వల్ల పలుచోట్ల హోర్డింగులు నేలకొరిగాయి. యూసఫ్‌గూడలోని శ్రీకృష్ణనగర్ పరిధిలోని పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటపాటు కురిసిన తేలికపాటి వర్షానికే నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వర్షపునీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి.