గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని మళ్లించేందుకు సూత్రప్రాయంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించిన కసరత్తు ఇంకా కొనసాగుతోంది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే వివిధ ప్రతిపాదనలపై బుధవారం 2 రాష్ట్రాల నిపుణులు విడివిడిగా హైదరాబాద్లో సమావేశమై చర్చించారు. ఒకే చోట నుంచి కాకుండా 2 రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అధికారుల నుంచి ఆ ప్రతిపాదన ఉన్నట్లు ఏపీ అధికారులు పేర్కొన్నారు. రెండు టీఎంసీలకు తెలంగాణ భూభాగంలోని అనువైన ప్రాంతం నుంచి, మరో రెండు టీఎంసీలను పోలవరం ఎగువ నుంచి మళ్లిస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే వ్యయ భారం అధికంగా ఉండచ్చనే అంశం కూడా పరిశీలనలో ఉంది.
హైదరాబాద్లో ఏపీ నిపుణుల కమిటీ భేటీ
హైదరాబాద్లోని పోలవరం అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ నిపుణుల కమిటీ సమావేశమైంది. హైడ్రాలజీ చీఫ్ ఇంజినీర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో పలువురు అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇందులో పోలవరం నుంచి ఎత్తిపోతల కాలువ... ఆపై పులిచింతల.. అక్కడి నుంచి టెయిల్పాండ్ నాగార్జున సాగర్, శ్రీశైలానికి నదీమార్గం మీదుగా మళ్లించే సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చించారు. సీఎం జగన్ సూచన మేరకు ఈ ప్రతిపాదన ఎంతవరకు సాకారమవుతుందనే అంశంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.