ప్రస్తుతం కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో ఇంట్లో పిల్లలతో పెద్దలు వ్యవహరించాల్సిన తీరుపై కేంద్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. పిల్లలు ఇంటిపట్టునే ఉంటూ చదువుతోపాటు, మిగతా విషయాలు నేర్చుకొనేందుకు పెద్దలు ఏం చేయాలో చెబుతూ 41 పేజీల మార్గసూచికను విడుదల చేసింది. పిల్లలతో వ్యవహరించాల్సిన తీరును ఇందులో వివరించింది. ఇంట్లో సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవడంతోపాటు, చెప్పే మాటలను పెద్దలు చేతల్లో చూపాలని సూచించింది. పిల్లల్లో మెదిలే.. ఎందుకు? ఏమిటి? ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేలా వీటిని రూపొందించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
అధిక సమయం..
- పిల్లలకు సరళమైన, స్థిరమైన రోజువారీ షెడ్యూల్‌ను ఖరారు చేయండి. ఏ సమయంలో చదువుకోవాలో నిర్ణయించుకొనే అవకాశాన్ని వారికే వదిలిపెట్టండి.
- ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు గురించి ఒక నిమిషం ఆలోచించుకోనివ్వండి. ఆ రోజు వారు చేసిన పనుల్లో సానుకూల విషయమో, సంతోషకరమైన విషయమో ఒకటి చెప్పమని అడగండి.
- టీవీ, ఫోన్ పక్కనపెట్టి, వాళ్లు ఏం చేయాలనుకుంటున్నదీ పిల్లలను అడగండి. వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. మీ దృష్టి అంతా వారిపైనే కేంద్రీకరించండి.
సానుకూల వాతావరణం..
- పిల్లలు ఎలా నడుచుకోవాలనుకుంటున్నదీ, వారిని ఎలా చూడాలనుకున్నదీ స్పష్టంగా చెప్పండి.
- సానుకూలమైన భాష ఉపయోగించండి. అది బాగా పనిచేస్తుంది.
- పిల్లలు మాట వినకపోయినప్పుడు, పెడసరంగా ప్రవర్తించినప్పుడు విసుక్కోకుండా అనునయించినట్లుగా సానుకూల స్వరంతో చెబితే వారు వింటారు. చేసే పనులను మెచ్చుకుంటే మరింత బాగా ప్రవర్తిస్తారు.
- కుటుంబ సభ్యులుగా రోజువారీ ఇంటి పనుల్లో ఎవరేం చేయాలో చెప్పండి. చెప్పింది ఆచరణలో చూపి, ప్రేమపూరితమైన బంధాలను ప్రదర్శించినప్పుడు పిల్లలు సుభద్రంగా ఉన్నామనే భావనకు లోనవుతారు.
- కుటుంబంలో సుహృద్భావ వాతావరణం ప్రస్తుతం అత్యంత ముఖ్యం.
ఇదీ చదవండి:'పిల్లల్లో కరోనా'పై కేంద్రం మార్గదర్శకాలు
ఇదీ చదవండి:పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి?
క్రమశిక్షణ..
- పిల్లలు ఎప్పుడైనా పెడసరంగా ప్రవర్తించినప్పుడు కొంత విరామం తీసుకోండి. తర్వాత విభిన్నమైన పనిలో నిమగ్నమయ్యేలా వారిని మళ్లించండి.
- పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పు సంకేతాలను తొలినాళ్లలోనే గుర్తించడానికి ప్రయత్నించండి. దానికి కారణాలేంటో గమనించి, ఆ విషయం గురించి వారితోనే చర్చించండి. వారిని బాధపెడుతున్న విషయాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే వారికి కౌన్సిలింగ్ ఇప్పించండి.
- కొట్టడం, అరవడానికి బదులు అలాంటి ప్రవర్తన వల్ల తలెత్తే పరిణామాల గురించి విడమర్చి చెప్పండి.
సంతోషంగా..
- పిల్లలతో మరింత దృఢమైన సంబంధాలు నెరపడానికి ఇదే మంచి సమయం. వారితో స్వేచ్ఛగా, సంతోషంగా గడపండి. దీనివల్ల పిల్లలు ప్రేమ, భద్రతను పొందుతారు. వారంటే మీకు ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చూపండి.
- ఉపాధ్యాయులు, నచ్చిన పాఠ్యాంశాలు, అభిరుచులు, స్నేహితుల గురించి చెప్పమని ప్రోత్సహించండి. స్కూల్లో ఇష్టంలేని విషయం ఏంటో కూడా అడిగి తెలుసుకోండి.
- ఇంట్లో ఎవ్వరూ ముక్కు, నోరు ముట్టుకోకుండా చూడటంతోపాటు, అందరూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కొనేలా చూసే బాధ్యతలను పిల్లలకే అప్పగించండి.
- పిల్లలు ఆటల ద్వారా బాగా నేర్చుకుంటారు. అందువల్ల వారికి చెప్పాలనుకున్న విషయాలను ఆటల ద్వారా నేర్పండి. ఇంట్లోనే శారీరక వ్యాయామం చేసేవిధంగా ఆడించండి.
- కథలు చెప్పడం, పాటలు పాడటం, జ్ఞాపకశక్తిని పెంచేలా గేమ్స్ నిర్వహించడం పిల్లలకు సంతోషాన్ని ఇస్తాయి.
ఇదీ చదవండి:2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్!
వాస్తవిక అంచనా..
- పిల్లలు మంచి పనులు చేసినప్పుడు, మీ అంచనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు అభినందించండి.
- పిల్లలు చేసే అన్ని పనులూ ముఖ్యమైనవే. వారి పనులను అభినందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సొంతంగా కథలు చెప్పడం, బొమ్మలు గీయడం, పాటలు పాడటంలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలి.
- వంట చేయడం, మొక్కలు, జంతువుల బాగోగులు చూడటం లాంటి అలవాట్లను వారిలో ప్రోత్సహించాలి.
ఆరోగ్యం.. ఆహారం
- కుటుంబం మొత్తం ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల కొవిడ్ నియంత్రణకు అనుకూలమైన అలవాట్లను పిల్లలకు చక్కగా నేర్పాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం, చిరుతిళ్లు తీసుకొనేలా చూడాలి.
- రోజూ వ్యాయామం, యోగాలాంటివి చేసేలా ప్రోత్సహించాలి. దానివల్ల వారు శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు.
- గత ఏడాది చిన్నారులపై లైంగిక దాడులు, హింస పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల పిల్లలకు మంచి, చెడు స్పర్శల్లోని తేడాలను వివరించాలి. కొత్తవారితో మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. బయటికి ఒంటరిగా వెళ్లొద్దని సూచించండి.
- కొవిడ్ గురించి వదంతులను నమ్మొద్దని చెప్పండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న విషయాల గురించి వివరించండి. ధైర్యంగా ఉంటూనే జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
- ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని పిల్లలు గమనిస్తారు. అప్పుడు వారు వేసే ప్రశ్నలను జాగ్రత్తగా వినండి. వాటికి చాలా నిజాయితీగా సమాధానం చెప్పండి. చెప్పకూడని విషయాలు ఏమైనా ఉంటే విస్మరించడం మంచిదే.
ఇవీ చదవండి: