Teacher turns village into school: కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో స్కూళ్లు మూతపడటం వల్ల చాలా మంది విద్యార్థులకు చదువు దూరమైంది. ఆన్లైన్, మొహల్లా క్లాసులు అని వివిధ రకాలుగా తరగతులను నిర్వహిస్తున్నా అవి విద్యార్థుల్లో అంత ప్రభావం చూపించలేదు. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో తమకు పనుల్లో సాయం ఉంటారని భావించి తల్లిదండ్రులు.. పిల్లలను వెంటతీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలోని ధర్మపుర గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే అక్కడి టీచర్ వినూత్న పరిష్కారాన్ని కనిపెట్టారు.
ధర్మపుర ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు దినేశ్ మిశ్రా. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడిన సమయంలో విద్యార్థులకు చదువు దూరం కాకుండా ఉండేందుకు కృషి చేశారు. వారికి ఏ విధంగా చెప్తే పాఠాలపై ఆసక్తి కలిగి సులువుగా అర్థం చేసుకుంటారో అందుకు తగ్గట్టుగా ఓ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని గోడలపై రంగురంగుల బొమ్మలు జోడించి పాఠాలు గీయించారు. గ్రామంలో ఏ వీధికెళ్లినా గోడమీద పాఠాలే దర్శనమిస్తాయి. ఊరు మొత్తాన్ని పాఠశాలగా మార్చేశారు.
'కరోనా సమయంలో గ్రామంలోకి వచ్చి పాఠాలను బోధించేవాడిని. గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు ఉదయాన్నే పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయేవారు. పేదరికం వల్ల తమ పిల్లలను కూడా పనికి తీసుకువెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని భావించాను. ఇందుకోసం గోడలపై పాఠాలు చిత్రించడం ప్రారంభించాను. దీని ద్వారా గ్రామంలోని ప్రతి గోడను బ్లాక్ బోర్డుగా మార్చా.'
-దినేశ్ కుమార్ మిశ్రా, ఉపాధ్యాయుడు