ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్న తరుణంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారుతూ ఈసారి అధికారం తమదేనంటూ తృణమూల్‌కు సవాల్ విసురుతోంది భాజపా. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
బంగాల్లో అధికార పీఠమెక్కేందుకు భాజపా ఎలాంటి వ్యూహాలు రచిస్తోందనే విషయంపై భాజపా రాష్ట్ర ఇంఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ 'ఈటీవీ-భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
భాజపా, తృణమూల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో ఇంకా ఎంత మంది టీఎంసీ నేతలు భాజపాలోకి చేరనున్నారు?
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరి వల్ల చాలా మంది తృణమూల్ నేతలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత పార్టీని వీడి భాజపాలోకి చేరాలని ఆశిస్తున్నారు. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాఫియా గ్రూప్‌లో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఆవుల అక్రమ రవాణా, దొంగ నోట్ల ముద్రణ, బొగ్గు మాఫియా వంటి వాటిలో తృణమూల్ నేతలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మాఫియాతో సంబంధమున్న నేతలను పార్టీలో చేరాలని భాజపా ఆహ్వానించదు. ప్రధాని నేతృత్వంలో బంగాల్ అభివృద్ధికి కృషి చేసే లక్ష్యంతో ముందడుగు వేసే నేతలకే భాజపా స్వాగతం పలుకుతుంది.
ఇదీ చదవండి:బంగాల్ గడ్డ మీద తృణమూల్‌కు భాజపా 'సవాల్'
మరికొంత మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని భాజపా చెబుతోంది. ఇతర పార్టీ నేతల రాక భాజపాలో ఎక్కువవుతోంది అనే అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
నేతలందరితో చర్చించాకే పార్టీ ఓ తుది నిర్ణయం తీసుకుంటుంది. భాజపా నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీలో ఎవరైనా చేరాల్సి వస్తే... ప్రతి ఒక్కరినీ సంప్రదించి అందరూ ఏకీభవిస్తేనే ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తాం.
బంగాల్లో జరుగుతోన్న అల్లర్లకు కారణం అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అని భాజపా ఆరోపిస్తోంది. రానున్న ఎన్నికల సందర్బంగా మరిన్ని అల్లర్లు జరిగే అవకాశముందా?
భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతున్న అంశాన్ని బంగాల్ ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అల్లర్లకు ఆజ్యం పోస్తూ తమ మద్దతు దారులను రెచ్చగొడుతున్నారు.