Terrorist Attack On Army Vehicles :జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో రెండు ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజౌరీ-థనామండీ-సురన్కోటె మార్గంలోని సావ్నీ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
బుఫ్లియాజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో జవాన్లను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీ వాహనాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, ముష్కరులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోందని రక్షణ శాఖ పీఆర్ఓ కార్యాలయం తెలిపింది. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రీయ రైఫిల్స్-48 పరిధిలో ఈ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఆయుధాలతో ముష్కరులు పరార్?
'ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నాం. ఆ సమయంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. బలగాలు దీటుగా స్పందించాయి' అని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు.
ఉగ్రవాదులతో సైనికులు ముష్టి యుద్ధం కూడా చేశారని అధికార వర్గాల సమాచారం. దాడి తర్వాత ఉగ్రవాదులు ఆయుధాలతో పారిపోయారని తెలుస్తోంది.
పార్కింగ్ ప్రదేశంలో పేలుడు
కాగా, బుధవారం పూంఛ్ జిల్లాలోని సోరన్కోట్ ప్రాంతంలో స్వల్ప తీవ్రతతో పేలుడు సంభవించింది. జమ్ము కశ్మీర్ పోలీసుల సాయుధ బెటాలియన్ పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు జవాన్లు మృతి
నెల రోజుల క్రితం రాజౌరీ జిల్లాలో జరిగిన ఘటనలో ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. రాజౌరీ జిల్లాలోని బాజిమాల్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో తనిఖీలు నిర్వహించగా సైనికులపై ముష్కరులు కాల్పులు జరిపారు. నవంబర్ 22న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కెప్టెన్లు, మరో ఇద్దరు జవాన్లు గాయపడగా- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఉగ్రవాదుల దాడులకు సైన్యం దీటుగా బదులిచ్చింది. ఐఈడీ నిపుణుడు, స్నైపర్ అయిన పాకిస్థాన్ తీవ్రవాది మట్టుబెట్టింది. మరో ముష్కరుడిని సైతం కాల్చి చంపింది. కాగా ఎదురు కాల్పుల్లో మరో జవాను అమరుడయ్యాడు.