Tamilnadu Ex IPS Jailed : ఓ మహిళా పోలీసు అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్‌ను స్థానిక విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆయనకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లడమే కాకుండా.. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఇక ఇదే కేసులో అప్పటి చెంగల్‌పట్టు ఎస్పీ కన్నన్‌కు కూడా విల్లుపురం న్యాయస్థానం జరిమానా విధించింది. రాజేశ్ దాస్‌పై ఫిర్యాదు చేయడానికి చెన్నై వెళ్తున్న ఆ మహిళా అధికారిణిని కారును టోల్ ప్లాజా వద్ద ఎస్పీ కన్నన్ అడ్డుకున్నారు. ఆ ఎస్పీపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళను అడ్డుకున్న ఎస్పీ కన్నన్ను కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో ఆయనను కూడా న్యాయస్థానం దోషిగా తేల్చి.. రూ.500 జరిమానా విధించింది.
ఇదీ జరిగింది..
ఐపీఎస్ అధికారి రాజేశ్ దాస్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ.. ఓ మహిళా ఐపీఎస్ 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. రాజకీయ నేత పళనిస్వామి సభకు బందోబస్తు నిర్వహించేందుకు తామిద్దరం ఒకే వాహనంలో వెళ్లాల్సి వచ్చిందని.. మార్గమధ్యలో సీనియర్ ఐపీఎస్ దాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వం.. రాజేశ్ దాస్‌ను సస్పెండ్ చేసింది. ఆయనపై విచారణకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.