తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర సంస్థల 'దుర్వినియోగం'పై విచారణకు నో- పిటిషన్ ఉపసంహరించుకున్న విపక్షాలు

దర్యాప్తు సంస్థలను.. కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైనా ఒక కేసుకు సంబంధించిన వాస్తవాల్ని పరిశీలించకుండా.. ఇలా అన్నింటికీ కలిపి మార్గదర్శకాలు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాన్ని విపక్ష పార్టీలు ఉపసంహరించుకున్నాయి.

supreme court on opposition petition
supreme court on opposition petition

By

Published : Apr 5, 2023, 4:14 PM IST

Updated : Apr 5, 2023, 5:06 PM IST

సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలో 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్​ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఒక కేసుకు సంబంధించిన సరైన ఆధారాలు లేకుండా ఇలా అన్నింటికీ కలిపి మార్గదర్శకాలు రూపొందించడం సాధ్యం కాదని.. ఇలా చేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించలేమని తేల్చి చెప్పింది. సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు సమానమని తాము అంగీకరించిన తర్వాత.. వారిని అరెస్ట్ చేయకూడదని తాము ఎలా చెబుతామని ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ పిటిషన్​ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని విపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం సమ్మతించడం వల్ల కేసును వెనక్కు తీసుకున్నారు. ఇలాంటి క్రిమినల్​ కేసు లేదా కేసులు ఉన్నప్పుడు.. మళ్లీ తమ వద్దకు రావాలని పిటిషనర్లకు సూచించింది.

ప్రతిపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. 95 శాతం కేసులు ప్రతిపక్ష పార్టీల పైనే ఉన్నాయని.. అరెస్ట్‌కు ముందు, తర్వాత మార్గదర్శకాలను కోరుతున్నామని సింఘ్వీ పిటిషన్‌లో కోరారు. కాంగ్రెస్ నేతృత్వంలో డీఎంకే, టీఎంసీ, భారాస, ఆర్జేడీ, ఆప్​, ఎన్సీపీ, ఎస్పీ తదితర పార్టీలు ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి.

పిటిషన్‌లో ఏముందంటే..
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే పార్టీలు.. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మాట్లాడే వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అరెస్ట్‌లకు పాల్పడుతోంది. కేంద్రం ఆదేశాలతో ఈడీ, సీబీఐ.. కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి.

  • ఈడీ నమోదు చేసిన కేసులు 2013-14లో 209 ఉండగా, 2020-21నాటికి అవి 981కి చేరగా.. 2021-22 నాటికి 1,180కి పెరిగాయి.
  • 2004-14 మధ్య కాలంలో CBI 72 మంది రాజకీయ నాయకులను విచారించగా.. అందులో 43 మంది (60%లోపు) ప్రత్యర్థి పార్టీల వారు ఉన్నారు. కానీ ఇప్పుడు 95% మంది ప్రతిపక్ష నాయకులే ఉన్నారు.
  • 2014 వరకు ఈడీ దర్యాప్తు చేసిన కేసుల్లో 54% మాత్రమే ప్రతిపక్ష పార్టీల వారు ఉండగా.. 2014 తర్వాత అది 95%కి చేరింది.
  • ఇలాంటి పరిస్థితుల్లో అధికరణం 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు గుర్తింపునిస్తూ దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలి.
  • తీవ్రమైన హింసాత్మక నేరాల్లో తప్పితే మిగిలిన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్ట్‌ చేసేటప్పుడు ట్రిపుల్‌ టెస్ట్‌ (పారిపోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాల తారుమారు చేయడం) అంశాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలి. ఒకవేళ ఆ అంశాలు సంతృప్తిగా లేవని భావిస్తే నిర్దిష్ట గంటల్లో దర్యాప్తు జరిపేలా కానీ, లేదంటే గృహ నిర్బంధం వరకు పరిమితమయ్యేలా ఆదేశించాలి.
  • అరుదైన సమయాల్లోనే జైలుకి పంపాలి. మిగిలిన సమయాల్లో బెయిల్‌ నిబంధన అనుసరించాలన్న సూత్రాన్ని అన్ని కోర్టులూ పాటించేలా చూడాలి. ట్రిపుల్‌ టెస్ట్‌ విఫలమైన కేసుల్లోనే బెయిల్‌ తిరస్కరించాలి.
  • మనీలాండరింగ్‌ లాంటి చట్టాల్లో బెయిల్‌ నిబంధనలు కఠినంగా ఉన్నట్లు అనిపిస్తే అధికరణం 21కి లోబడి ఉత్తర్వులు జారీ చేయాలి. ఆరు నెలల్లోపు విచారణ పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోతే నిందితులకు బెయిల్‌ ఇవ్వాలి.
  • ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో 45.19%, పార్లమెంటు ఎన్నికల్లో 42.5% ఓట్లు వచ్చాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.
  • దర్యాప్తు సంస్థలు దాడుల అనంతరం తీసుకున్న చర్యల రేటు 2005-14 మధ్యకాలంలో 93% ఉండగా, 2014-22 మధ్యకాలంలో అది 29%కి పడిపోయింది. PMLA చట్టం కింద కేవలం 29 శిక్షలు మాత్రమే పడ్డాయి.

ఇవీ చదవండి :'హనుమాన్ జయంతి వేళ జాగ్రత్త'.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

బీజేపీ తరఫున కిచ్చా సుదీప్ ప్రచారం.. ఎన్నికల్లో పోటీకి దూరం!

Last Updated : Apr 5, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details