జమ్ముకశ్మీర్ విషయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu) సలహాదారులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ(Sidhu advisers remarks on Kashmir) సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోనూ పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ ఏంటంటే?
ఆర్టికల్ 370 గురించి మాట్లాడిన సిద్ధూ సలహాదారు మల్విందర్ సింగ్ మాలి(Malvinder Singh Mali).. ప్రత్యేక హోదా నిబంధన అవసరమే లేదని అన్నారు. 'కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైతే.. ఆర్టికల్ 370, 35ఏ నిబంధనలు ఉండాల్సిన అవసరం ఏంటి? కశ్మీరీ ప్రజల దేశమే కశ్మీర్' అంటూ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరో సలహాదారుడు ప్యారేలాల్ గార్గ్(Pyare Lal Garg controversial remarks).. పాకిస్థాన్‌పై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ విమర్శలు చేయడాన్ని ప్రశ్నించారు. దీనిపై వివాదం చెలరేగుతోంది.
కాంగ్రెస్‌లో స్థానం అవసరమా?
భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కాదనేవారు, పాకిస్థాన్ అనుకూల ధోరణి ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ(Manish Tewari) సూచించారు. అలాంటి వారికి పంజాబ్ పీసీసీలో స్థానం అవసరమా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్(Harish Rawat)ను కోరుతూ మనీశ్ తివారీ ట్వీట్ చేశారు.