ఒకప్పుడు సాయిబాబా చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అన్నారు. దేశాన్ని ఐక్యం చేయడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ కలలను రాహుల్ గాంధీ నిజం చేస్తారని వాద్రా ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్న అనంతరం వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
"లక్షలాది మంది ప్రజలు నిత్యం షిర్డీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నారు. వారి భావాలు ఏమిటో నేను తెలుసు కోవాలనుకుంటున్నాను. సాయిబాబా కులమతాలకు అతీతంగా.. ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ఈ రోజున దేశానికి ఇదే కావాలి. రాహుల్ గాంధీ ఆలోచన కూడా ఇలాంటిదే కనుక.. దేశాన్ని ఏకం చేయాలని జోడో యాత్ర చేపట్టారు. సర్వధర్మ సమానత్వం అనే ఆలోచన కూడా.. బాబాకు, రాహుల్కు ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రజలకు అన్యాయం జరుగుతోంది. కొన్ని కేసులు కారణంగా ఈడీ కార్యాలయం దాటి బయటకు రాలేకపోతున్నాం. దీని వలన నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడటం కుదరడం లేదు. మీడియా దృష్టంతా ఈడీ కేసుపైనే ఉంది. కనీసం మమ్మల్ని కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు కూడా అనుమతించడం లేదు. ప్రియాంకా కూడా బారికేడ్లు దూకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే మా కుటుంబం గురించి నిత్యం ప్రజలు ఆలోచిస్తుంటారు."