Ram Mandir Golden Door : అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బంగారు తాపడంతో రూపొందించిన తలుపులను రామాలయ గర్భగుడికి అమర్చారు. దిల్లీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ తలుపులకు బంగారు తాపడం చేసింది. మిగిలిన 14 తలుపులకు స్వర్ణ తాపడాన్ని చేస్తామని అధికారులు వివరించారు. ఆలయ మొదటి అంతస్తు పనులు 80 శాతం పూర్తైనట్లు వెల్లడించారు.
మరోవైపు చరణ్ పాదుక యాత్ర కోసం పటిష్ఠ ఏర్పాటు చేసింది రాష్ట్ర పర్యటక శాఖ. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 14న చిత్రకూట్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. మంఝాపుర్, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పుర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్లే యాత్ర జనవరి 19న అయోధ్యలోని నందిగ్రామ్ వద్ద ముగుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మార్చి 24 వరకు అయోధ్యలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఇందుకోసం సుమారు 35వేల మంది కళాకారులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ప్రతి రోజు 500 మంది కళాకారుల చొప్పన ప్రదర్శన చేస్తారని వివరించారు.
రాముడి కోసం దివ్యాంగుల పైతాని శాలువా
మహారాష్ట్ర నాశిక్‌కు చెందిన దివ్యాంగ కళాకారులు రాముడి కోసం పైతాని శాలువాను రూపొందించారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ సమయంలో శ్రీరాముడు ఈ శాలువాను ధరించనున్నాడు. సిల్క్ దారంతో నేసిన ఈ శాలువాలో వివిధ రంగులనే కాకుండా బంగారు, వెండి జరీని ఉపయోగించారు. యెవల్యా కాపసే ఫౌండేషన్‌కు చెందిన కళాకారులు సుమారు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. దీంతో పాటు ఫౌండేషన్‌కు చెందిన గిర్ ఆవుల నుంచి సేకరించిన 251 కిలోల నెయ్యిని సైతం అయోధ్యకు పంపిస్తున్నారు.