Nupur Sharma news: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను దిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నమోదైన్న అన్ని ప్రాథమిక దర్యాప్తు నివేదికలను జతచేసి దిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో దిల్లీ పోలీసుల విచారణ పూర్తయ్యేంత వరకు నుపుర్ శర్మకు కల్పించిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు నుపుర్ శర్మకు కోర్టు అనుమతి ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలపై ఇకపై నమోదయ్యే ఎఫ్ఐఆర్లను కూడా దర్యాపు కోసం దిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎఫ్ఐఆర్లను దిల్లీ పోలీసులకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం దర్యాప్తు జరుపుతుందని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. టీవీ చర్చల్లో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. దేశవ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. గల్ఫ్ దేశాల నుంచి సైతం నుపుర్ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అనంతరం నుపుర్ శర్మను భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది.