PM Modi Comments on BRS Govt : తెలంగాణలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా సాథ్' అనే నినాదంతో సామాన్యులతోనే ఉండి దేశాభివృద్దికి పాటుబడ్డామని ప్రధాని అన్నారు. ప్రియమైన సోదర సోదరీమణులారా... మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ... కేంద్రంలోకి తామోచ్చాక తెలంగాణలో భారీగా అభివృద్ది జరిగిందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరోపణలను మోదీ ఖండించారు. అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వంతో.. రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావట్లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందన్నారు.
దేశం ఒక నవ భారతం.. నలుమూలల అభివృద్ధి చెందుతోంది :కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదన్న మోదీ.. అవినీతిపరులకు నిజాయతీతో పని చేసే వారంటే భయం పట్టుకుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలు ద్వారా టెక్నాలజీ నుంచి ఆధ్యాత్మిక ప్రాంతానికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ పనులు చేపట్టామని... ఈ రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఒక నవ భారతమని... నలుమూలల అభివృద్ది జరుగుతోందన్నారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులతో రవాణా సమయం తగ్గడంతో పాటు ట్రాన్స్ పోర్ట్ సులువుగా అయిందన్న ప్రధాని మోదీ... పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు.
కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్‌గా మారింది : దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్కులను కేంద్రం ఏర్పాటు చేస్తోందని... తెలంగాణకు ఒకటి కేటాయించామని దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మోదీ తెలిపారు. ఈ నవభారతంలో దేశ ప్రజల కలలను నిజం చేయడమే తమ ధ్యేయమని... కానీ పిడికేడంతా కూడా లేని కొందరు వ్యక్తులు తమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. కుటుంబ పార్టీ, మామ, అల్లుడు, కూతురు, కొడుకు ఉన్న పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్‌గా మారిందని దుయ్యబట్టారు. కుటుంబ పార్టీలు అందరినీ తమ కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తాయన్న ప్రధాని... వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే వారికి నచ్చదని... అలా ప్రశిస్తే అణిచివేయాలని చూస్తారని విమర్శించారు.