Pm Modi Speech Today Opposition Reaction :అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. తొలి 90 నిమిషాల్లో మణిపుర్ అంశాన్ని ప్రస్తావించలేదని మండిపడ్డాయి. ఆ సమయంలో తాము చాలా సార్లు జోక్యం చేసుకున్నా ఆయన వినలేదని మండిపడ్డాయి. మోదీ చేసింది కేవలం రాజకీయ ప్రసంగమని విమర్శించాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీగా ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ సుదీర్ఘ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. 'మణిపుర్‌పై జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మేము ప్రధానిని కోరాము. గంట 45 నిమిషాల తర్వాత కూడా మోదీ మణిపుర్ పదాన్ని ప్రస్తావించలేదు. ఆయన పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలపై పాత పాటే పాడారు. అవమానాలు అన్నీ జరిగాయి. కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు లేవు' అని థరూర్ అసహనం వ్యక్తం చేశారు.
"తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది- మణిపుర్ ప్రజలకు న్యాయం జరగడ. రెండోది- మణిపుర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడటం. చాలా కాలం తర్వాత, ప్రధాని సభలో మాట్లాడటం దేశం చూడగలిగింది. మేము ఆయన మౌనాన్ని వీడమని బలవంతం చేశాం. కానీ మణిపుర్‌కు న్యాయం చేయాలనే మా లక్ష్యం నెరవేరలేదు. ప్రధాని మోదీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు"
-- గౌరవ్ గొగొయ్, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ
అవిశ్వాస తీర్మానం ఉద్దేశం.. మణిపుర్, హరియాణా వంటి ఇతర ప్రాంతాలపై జరుగుతున్న హింసపై ఆయన స్పందన వినడమేనని.. కానీ తాము చాలాసార్లు జోక్యం చేసుకున్నా ఆయన స్పందించలేదని తమిళనాడు డీఎమ్‌కే పార్టీ ఎంపీ టీఆర్ బాలు అన్నారు. భారత చరిత్రలో గొప్ప స్పిన్నర్ ఎవరనే చర్చ సెటిల్ అయిందని.. అది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు.
మణిపుర్ గురించి మోదీ ఏమీ మాట్లాడలేదు : డింపుల్ యాదవ్
'అవిశ్వాస తీర్మానానికి కారణం.. మణిపుర్‌లో అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పిల్లల చనిపోయారు. అనేక ఇతర సంఘటనలు ఉన్నాయి. అయితే మణిపుర్ గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదు. మణిపుర్ ప్రజలతో నిలబడలేదు. అందుకే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి' అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తెలిపారు.