ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ హృదయంలో ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అందుకే అభివద్ధి ప్రాజెక్టులు వరద ప్రవాహంలా వస్తున్నాయన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా మణిపుర్‌కు ఆదివారం వెళ్లారు అమిత్ షా. హప్తా కాంగ్జీబంగ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఒకప్పుడు మణిపుర్ అంటే తిరుగుబాటు, బంద్‌లు, దిగ్బంధాలకు కేంద్రం అనే వారని, కానీ భాజపా హయాంలో పరిస్థితి మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని విమర్శలు గుప్పించారు షా. ఇప్పుడు బీరెన్ సింగ్ మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని కితాబిచ్చారు.