Odisha Train Accident Reason : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి ఆదివారం చెప్పారు. ఈ ప్రమాదానికి కవచ్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రమాదానికి శనివారం బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన కారణం కాదని.. ఇంటర్ లాకింగ్‌లో మార్పు వల్లే జరిగిందని స్పష్టం చేశారు.
"ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రమాదస్థలిని పరిశీలించి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రధాని సూచనల మేరకు ట్రాక్‌ను పునరుద్ధరించే పని వేగంగా జరుగుతోంది. ఈ రోజు ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మధ్యాహ్నం 12.05 గంటలకు డౌన్ మెయిల్ లైన్‌ను పునరుద్ధరించాం. వ్యాగన్లు, కోచ్‌లు అన్నింటినీ ఇక్కడి నుంచి తరలించారు. మృతదేహాలను కూడా ఇక్కడి నుంచి తరలించాం. ప్రత్యేక ఆపరేషన్ త్వరితగతిన జరుగుతోంది. బుధవారం ఉదయం నాటికి ట్రాక్‌ను పూర్తిగా పునరుద్ధరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బుధవారం ఉదయం పూర్తి పునరుద్ధరణ పూర్తై రైళ్లు సాధారణంగా తిరగాలని భావిస్తున్నాం. దర్యాప్తు కూడా పూర్తవుతోంది. రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా అందజేస్తారు. ఇంతటి విషాదమైన భయానకమైన ప్రమదానికి కారణమేంటన్నది ఇప్పటికే గుర్తించాం. ఈ సమయంలో నేను ప్రమాద కారణాలపై ఇంకా మాట్లాడడం సమంజసం కాదు. దర్యాప్తు నివేదిక అందనివ్వండి. కానీ ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్పు ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అన్నది దర్యాప్తులో తేలుతుంది.
--అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి
మృతులు 288 కాదు..275
ఒడిశా బాలేశ్వర్ జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288 కాదని.. 275 అని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర సీఎస్ ప్రదీప్ జెనా. కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కపెట్టడం వల్ల ఇలా జరిగిందని ఆయన తెలిపారు. మార్చురీలో ఉన్న మృతదేహాలన్నింటికీ.. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ఆధ్వర్యంలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 275లో 88 మృతదేహాలను ఇప్పటికే గుర్తించామన్నారు. 1,175 మంది గాయపడగా.. వారిలో 793 మంది చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారని వివరించారు.