Abhishek Banerjee School : బంగాల్‌లో దుమారం రేపిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు కోల్కతాలోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించింది. సీబీఐ నోటీసుల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభిషేక్ బెనర్జీ దాఖలుచేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన మరుసటిరోజు ఆయనకు నోటీసులు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బొగ్గు కుంభకోణం వ్యవహారంతో కూడా అభిషేక్ బెనర్జీకి సంబంధాలున్నాయంటూ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ ఆయన్ను పలుమార్లు విచారించింది.
"గత కొన్నేళ్లుగా బంగాల్‌లో సీబీఐ అనేక దాడులను నిర్వహిస్తోంది. నాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐ అధికారులు నిరూపించి నన్ను అరెస్ట్ చేయాలని సవాల్ విసురుతున్నాను. నేను చేపట్టిన క్యాంపెయిన్ తృణమూల్ నబోజోవర్ (తృణమూల్ న్యూ వేవ్) రోడ్ షోలో మా పార్టీకి దక్కుతున్న ప్రజల మద్దతును చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మాపై దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోంది."
-అభిషేక్ బెనర్జీ, టీఎంసీ నేత