New Parliament Building First Session : దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం సరికొత్త ఘట్టానికి వేదిక కానుంది. దేశానికి పునర్వైభవం తెచ్చే అమృత కాలంలో.. 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవనున్న కొత్త ప్రజాస్వామ్య మందిరంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలుకానున్నాయి.
టైం అయిపోతే.. మైక్ కట్..
New Parliament Building Features :కొత్త పార్లమెంట్ భవనంలో మైక్‌లన్నీ ఆటోమేటిక్ వ్యవస్థ సాయంతో పనిచేస్తాయని సమాచారం. సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ కేటాయించిన సమయం పూర్తి కాగానే.. మైక్రోఫోన్ ఆటోమెటిక్‌గా స్విచ్ఛాప్ అవుతుంది. సభలో తమకు మైక్ ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆటోమేటిక్ మైక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై విచారణ జరగాలని గత సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. తమ వాణి వినిపించకుండా ప్రభుత్వం మైక్ కట్ చేస్తోందని ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష నేతలు మాట్లాడటానికి లేచిన సమయంలో పార్లమెంట్‌లో మైక్‌లు సరిగా పనిచేయవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు మైక్ ఇవ్వకుండా ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు తెలపడానికి వీలులేకుండా ఆ ప్రాంతాన్ని బాగా కుదించినట్లు తెలుస్తోంది.
కాగితాలు వాడరిక..
దీంతో పాటు కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్ ఇస్తారు. అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా ప్రవేశ నిబంధనలు కఠినతరం చేశారు.
అలా చేస్తే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది: ఖర్గే
Parliament Special Session 2023 :మరోవైపుపార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill 2023) కేంద్రం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. అసెంబ్లీ, లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు 2010లో రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. పలు కారణాలతో ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించలేదు. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని మేం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాం. మహిళలకు దక్కాల్సినవి అన్ని వారికి దక్కాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇందు కోసం సుదీర్ఘంగా కృషి చేస్తున్నాం. ఉభయ సభల్లో మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. శాసన సభల్లో వారి ప్రాతినిధ్యం 10 శాతమే. అమెరికా పార్లమెంట్లో 2 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. బ్రిటన్‌లో 3 శాతం నుంచి 33 శాతానికి చేరింది"
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు