భారత్, స్వీడన్ దేశాలు స్మార్ట్ సిటీలు, ఈ-మొబిలిటీ, స్మార్ట్ గ్రిడ్స్, వ్యర్థాల నిర్వహణ వంటి పలు రంగాల్లో సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ మార్పులు వంటి ప్రాధాన్యాంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్తో వర్చువల్గా సమావేశమయ్యారు మోదీ. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టాలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించినట్లు చెప్పారు.
"ఆవిష్కరణలు, సాంకేతికత, పెట్టుబడులు, అంకురాలు, పరిశోధనల్లో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాం. స్మార్ట్ సిటీలు, నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వాహణ, స్మార్ట్ గ్రిడ్స్, ఈ-మొబిలిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి ఇతర కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నాం.
ఇరు దేశాలకు పర్యావరణ మార్పులు అనేది ప్రాధాన్యాంశం. ఈ విషయంపై ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రాముఖ్యాన్ని భారతదేశ సంస్కృతి ఎల్లప్పుడూ నొక్కి చెబుతుంది. పారిస్ ఒప్పందం ప్రకారం కట్టుబడి ముందుకు సాగుతాం. ఈ లక్ష్యాలను సాధించటమే కాకుండా.. వాటిని మరింత విస్తరిస్తాం. జీ-20 దేశాల్లో భారత్ తన లక్ష్యాలను చేరుకోవటంలో మంచి పురోగతి సాధించింది. గడిచిన 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం 162 శాతం పెరిగింది. "