Minister KTR Condoles Death of Jawan Anil: జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన జవాన్ అనిల్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే అనిల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. మరోవైపు అనిల్ మరణంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పందించారు. జవాన్ అనిల్ మృతి బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా అనిల్ మృతిపై సంతాపం తెలిపారు.
అసలు ఏమైందంటే: భారత సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో.. దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. మరువా నదీతీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్ శకలాలను స్థానికులు గుర్తించారు. ఆర్మీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని.. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలవారు కూడా వారికి సహకరించారు. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బాల అనిల్(29) మృతి చెందగా, మరో ఇద్దరు గాయలపాలయ్యారు. మృతి చెందిన అనిల్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి అని అధికారులు తెలిపారు.