మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం ఉజ్జయినిలోని పురాతన మహాకాళేశ్వర్ ఆలయం నూతన సొబుగులు అద్దుకొని తణుకులీనుతోంది. అడుగడుగునా శివతత్వాన్ని బోధిస్తూ పురాణాల సారాన్ని వివరిస్తూ జీవం ఉట్టిపడేలా ఏర్పాటు చేసినా శిల్పాలు కట్టిపడేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఉన్న పురాతన మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు అబ్బురపరుస్తున్నాయి. ఏడాది పొడవునా భక్తుల రాకపోకలు ఉండే మహాకాళేశ్వర్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అభివృద్ధి పరిచిన 900 మీటర్ల పొడవైన కారిడార్ అయిన మహాకాల్ లోక్ భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తోంది.
మహాకాల్ లోక్ భక్తులకు స్వాగతం పలుతున్నట్టుగా రెండు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీ ద్వార్.. ఎత్తయిన రెండు నందులు.. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకో ద్వారం పేరు పినాకి ద్వార్.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. బ్రహ్మ రథసారధిగా ఉండగా.. పరమేశ్వరుడు ధనుస్సు చేతబట్టి.. త్రిపురాసురులను ఒకే బాణంతో అంతం చేస్తాడు. ఆ ఘట్టాన్ని వివరించేలా చెక్కిన శిల్పం.. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.
ఈ ద్వారాల నుంచి లోపలికి అడుగుపెట్టగానే మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తాం. 108 రాజస్థాన్ రాతి స్తంభాలు మనకు స్వాగతం పలుకుతాయి. జలయంత్రాలు.. 50కు పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. మనల్ని అబ్బురపరుస్తాయి. నంది, భైరవ, గణేశ, పార్వతి మాత సహా ఇతర దేవతల విగ్రహాలు మనకి భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి.
మహాకాల్ లోక్‌లో.. కమల్ సరోవర్ ప్రత్యేక ఆకర్షణ. ఈ సరస్సులో చుట్టూ కమలాలను ఏర్పాటు చేయగా.. మధ్యలో ధ్యానముద్రలో పరమశివుడు కొలువు దీరాడు. నీల కంఠుడి చుట్టూ సింహాలను ఏర్పాటు చేశారు. కమల్ సరస్సులో ఏర్పాటు చేసిన కృత్రిమ కమలాలు.. ఆకట్టుకుంటాయి.