Man kills dog: మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ అతి దారుణంగా శునకాన్ని హత్య చేశాడు. గ్వాలియర్ జిల్లా సిమారియాతల్ గ్రామంలో దాదాపు నెల క్రితం ఈ ఘటన జరిగింది.
వైరల్గా మారగా..
Viral video of dog killing: శునకం హత్యకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్గా మారింది. ఆ వీడియోలో నిందితుడు... శునకాన్ని చితకబాదుతున్నట్లుగా కనిపించింది. అది నొప్పితో విలవిలలాడుతున్న క్రమంలో దాని కాలిని పదునైన ఓ కత్తితో కోయడం కనిపించింది. దీనిపై గ్వాలియర్ పోలీసుల చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పెటా) కార్యకర్తలు డిమాండ్ చేశారు.
పెటా కార్యకర్త ఛాయా తోమర్ ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. "తన కుమారుడి దవడను శునకం కరవగా నిందితుడు సాగర్ విశ్వాస్ ఆగ్రహానికి గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని మరో ఐదుగురిని కూడా శునకం కరించిందని వారు చెప్పారు" దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ తెలిపారు. కోర్టు ముందు హాజరు కావాలని నిందితుడికి నోటీసులు పంపించినట్లు చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారడం వల్ల ఈ శునకం హత్య విషయాన్ని తాము తెలుసుకున్నామని పెటా కార్యకర్తలు ఆశర్, ప్రియాన్షు జైన్ తెలిపారు. మధ్యప్రదేశ్లో ఇంతకుముందెన్నడూ తాము జంతువులపై ఇలాంటి క్రూర ఘటనను చూడలేదని చెప్పారు. జంతువులకు నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.