తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2021, 8:32 AM IST

ETV Bharat / bharat

'భారత్​లో అధికార మార్పిడికి ఆటంకాలుండవు'

భారత్​లో అధికార మార్పిడి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని, అదే మన ప్రజాస్వామ్య ప్రత్యేకతని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. అమెరికాలో ప్రస్తుతం అధికార మార్పిడి వేళ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​లో ఆ రాష్ట్ర పంచాయతీల ప్రతినిధులకు పార్లమెంట్​, ప్రజాస్వామ్య సూత్రాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.

lok sabha speaker om birla states that there is no troubles of power transfer in idia
'భారత్​లో అధికార మార్పిడికి ఆటంకాలుండవు'

భారత్​లో ఎన్నికల అనంతరం అధికార మార్పిడి ప్రక్రియ ఎప్పుడూ సవ్యంగా, సాఫీగానే జరుగుతోందని, మన ప్రజాస్వామ్యంలో అదో విశిష్ట లక్షణమని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. ప్రజలే కేంద్రంగా ప్రభుత్వం నడవాలన్నిది మన రాజ్యాంగం ప్రాథమిక సూత్రమని చెప్పారు. పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికాలో ప్రస్తుతం అధికార మార్పిడి వేళ గందరగోళం నెలకొనడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​లో ఆ రాష్ట్ర పంచాయతీల ప్రతినిధులకు పార్లమెంట్​, ప్రజాస్వామ్య సూత్రాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. పార్లమెంటరీ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ డెమొక్రసీస్​(ప్రైడ్​), లోక్​సభ సచివాలయం, ఉత్తరాఖండ్​ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. దేశంలో స్వాతంత్ర్యానంతరం ఇప్పటివరకు 17 సార్వత్రిక ఎన్నికలు, 300కు పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఎప్పుడూ అధికార మార్పిడి విషయంలో అవరోధాలు ఎదురుకాలేదన్నారు. పంచాయతీరాజ్​ సంస్థలు సమర్థంగా, బాధ్యతగా పనిచేస్తే సమాజంలో సంపూర్ణ మార్పు సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్​ వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్​ సంస్థల కారణంగానే దేశంలో ప్రజాస్వామ్యం దృఢంగా ఉందని ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్​ అన్నారు. పట్టణాల్లో జరిగే అభివృద్ధి ..గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ అవినీతికి ఆస్కారం లేకుండా మరింత పరిపుష్టం కావాలన్నారు.

త్వరలో పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు త్వరలోనే ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా చెప్పారు. సమావేశాల ప్రారంభానికి ముందే సభ్యులకు కొవిడ్​ టీకాలు వేసే విషయమై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. సమావేశాలు ఇంతకుముందులాగే సాధారణంగా, పూర్తిస్థాయిలో జరుగుతాయని, అన్ని అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు.

చర్చలు, వాదనలు.. మన సంప్రదాయాల్లో భాగాలే ..

ఇతరుల దృష్టి కోణాన్ని వినడం పురాతన భారతీయ సంప్రదాయమని, వేద యుగం నుంచే ఈ ఆనవాయితీ ఉందని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. అప్పట్లో ప్రజలంతా బహిరంగ ప్రదేశంలో సమావేశమై తమతమ అభిప్రాయాలు చెప్పేవారని, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ..వాటిలోని లాభనష్టాలు బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకొనేవారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్​ సైతం ఇదే తరహాలో నడుస్తున్నాయన్నారు. ఫిట్టీ సహకారంతో నేషనల్​ యూత్​ పార్లమెంట్​ ఆర్గనైజేషన్​ (ఎన్​వైపీఓ) ఆధ్వర్యంలో అన్నిరాష్ట్రాల సభ్యులతో ఏర్పాటుచేసిన ఆన్​లైన్​ మాక్​ బడ్జెట్​ సమావేశాల్లో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవాలంటే యువత భాగస్వామ్యం కీలకమని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవంలో యువత భాగస్వామ్యం పెరగాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడాన్ని ఓం బిర్లా కొనియాడారు. 'నో యువర్​ కాన్ట్సిట్యూషన్​(కేవైసీ)అంటూ విద్యార్థులకు మోదీ ఇచ్చిన నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. ఈనెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఆన్​లైన్​ మాక్​ బడ్జెట్​ సమావేశాల్లో భిన్న రంగాలపై చర్చించి తయారుచేసిన నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అందించనున్నట్లు ఎన్​వైపీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు కార్తికేయ కోయల్​ తెలిపారు.

ఇదీ చదవండి:మరోసారి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details