Khandwa Youth Trapped In Silencer: మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు సైలెన్సర్లో చిక్కుకున్న యువకుడ్ని అలాగే రెండున్నర కిలోమీటర్లు లాక్కెళ్లాడు డ్రైవర్. దీంతో శరీరం రోడ్డుకు రాసుకుని.. బాధితుడు తీవ్ర గాయాలతో మరణించాడు.
మామయ్య ఇంటికి వెళ్లి మద్యం మత్తులో కారు నడుపుతూ వస్తున్నాడు నిందితుడు. ఖాండ్వా ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఓ యువకుడ్ని ఢీకొట్టింది కారు. అయితే.. ప్రమాదవశాత్తు బాధితుడు కారు సైలెన్సర్లో చిక్కుకున్నాడు. అది గమనించని కారు డ్రైవర్ అలాగే వెళ్లిపోయాడు. సైలెన్సర్లో యువకుడ్ని గమనించిన స్థానికులు.. కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రమాదానికి కారణమైనందుకు తనను చితకబాదుతారనే భయంతో కారు వేగాన్ని పెంచాడు డ్రైవర్. ఈ క్రమంలో ఓ బైక్ను కూడా ఢీకొట్టాడు. చివరకు అతి కష్టం మీద కారును ఆపారు స్థానికులు. సైలెన్సర్లో చిక్కుకున్న యువకుడ్ని బయటికి తీయగా.. ఒళ్లంతా రక్తసిక్తమయ్యింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.