Karnataka floods 2022: కర్ణాటకలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మైసూర్ ప్రాంతం, మండ్య, చామరాజనగర, రామనగర, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు మైసూరు, బెంగళూరు మధ్య రహదారిపై నీరు చేరింది. మండ్య, రామనగర, చామరాజనగర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
రామనగరలో అండర్‌పాస్ వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి ప్రయాణికులను రక్షించారు. రామనగరలో అనేక కార్లు, వాహనాలు నీట మునిగాయి. మరికొన్ని వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై నీరు చేరడం వల్ల నీట మునిగిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రహదారిలో ట్రాఫిక్ రద్దీ పెరిగి.. వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు, తుమకూరులో రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్ ఇల్లు నీట మునిగింది.
కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి..
Kerala landslide 2022: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి కేరళ.. ఇడుక్కిలో ఐదుగురు మరణించారు. జిల్లాలోని తొడుపుజా కడయాతుర్ గ్రామంలో ఈ ఘటన సోమవారం జరిగింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడి ఇంటిపై పడ్డాయని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి.. ఐదు మృతదేహాలను వెలికి తీశాయి. సోమన్, అతని భార్య జయ, తల్లి తంకమ్మ, కూమార్తె షీమ, కుమారుడు దేవాంద్ ఈ ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.