జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్ హేమేంద్ర శిందే. తాను జేఈఈ కోచింగ్ సమయంలో ఫోన్‌కు దూరంగా ఉన్నానని, అందుకే పరీక్షల్లో విజయం సాధించానని చెప్పాడు ధ్యానేశ్. మరోవైపు, జేఈఈ ఫలితాల్లో ధ్యానేశ్తోపాటు మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. వీరిలో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.
ఎన్టీఏ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో ధ్యానేశ్.. 100 శాతం మార్కులు సాధించడంపై అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం థియరిటికల్ నాలెడ్జ్‌తో పరిజ్ఞానంతో జేఈఈ పరీక్షల్లో విజయం సాధించలేమని తెలిపాడు ధ్యానేశ్. ఎప్పటికప్పుడు సిలబస్‌ను రివిజన్ చేసుకోవాలని.., ప్రాక్టీస్ పరీక్షలు రాస్తూ టైంను సర్దుబాటు చేసుకోవాలని చెప్పాడు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఒక మార్కు తగ్గినా ర్యాంకులో వెనకబడిపోతామని అన్నాడు ధ్యానేశ్. అందుకే ఎల్లప్పుడూ వంద శాతం మార్కులను సాధించడానికి ప్రయత్నించాలని సూచించాడు.
"నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాలని నిశ్చయించుకున్నా. ఐఐటీ బాంబేలో సీటు సాధించాలని అనుకున్నా. నేను రాజస్థాన్.. కోటాలోని అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో జేఈఈ కోచింగ్ తీసుకున్నా. ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని మొబైల్‌ను వాడలేదు. దేశంలోనే కోటాను నాలెడ్జ్ సెంటర్‌గా పిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యంతో ఉన్నవారికి కోటాలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నా సందేహాలన్నింటినీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీర్చుకునేవాడిని. రివిజన్ చేయడం, కష్టపడి చదవడం వల్ల జేఈఈలో 100 శాతం మార్కులు సాధించా."