భారత్ - చైనాల సైనిక ఉన్నతాధికారుల మధ్య 13వ దఫా చర్చలు సఫలం కాని నేపథ్యంలో.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో 'ఆపరేషన్ మలబార్'(Operation Malabar) విన్యాసాలు నిర్వహించడం ద్వారా డ్రాగన్‌కు గట్టి సందేశం పంపించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే అమెరికా నౌకాదళ అధిపతి అడ్మిరల్ మైఖేల్ గిల్డే దిల్లీకి వచ్చి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా భారత్ - చైనా సైనిక ఉన్నతాధికారుల చర్చలు ముగిశాక విడుదల చేసే ప్రకటనల్లో సరిహద్దులో శాంతి సామరస్యాలు నెలకొనాలనే అభిలాష వ్యక్తమవుతూ ఉంటుంది. తాజా భేటీ తర్వాత మాత్రం సరిహద్దు చర్చల్లో చైనా సైన్యం వైఖరి తమకు సమ్మతంగా లేదని, పరిష్కారం కోసం ముందడుగు వేసే ప్రతిపాదనలేమీ రాలేదని భారత్ అధికార ప్రకటన పేర్కొంది.
మరోవైపు చైనా సైన్యం (పీఎల్‌ఏ) కూడా.. భారత సైన్యం అవాస్తవిక, అసమంజస వైఖరిని అవలంబించిందని, చర్చలు ముందుకు సాగలేని స్థితి కల్పించిందని వ్యాఖ్యానించింది. ఈ భేటీ అనంతరం భారత్ క్వాడ్ దేశాలతో కలసి ఆపరేషన్ మలబార్(Malabar exercise) రెండో దశ విన్యాసాలను బంగాళాఖాతంలో ప్రారంభించింది. దీనికి ముందు మొదటి దశ విన్యాసాలు ఫిలిప్పీన్ సముద్రంలో ఆగస్టు 26-29 తేదీల మధ్య జరిగాయి. ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ ఏర్పడగా.. దీనిపై చైనా రుసరుసలాడుతోంది. అయితే క్వాడ్ దేశాలు చైనాను ఖాతరు చేయడం లేదు. బంగాళాఖాతంలో ఇటీవల చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల సంచారం పెరిగింది. దీంతో క్వాడ్ దేశాలు శత్రు నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే అభ్యాసాలను నిర్వహిస్తున్నాయి. తమ నావికుల మధ్య సమన్వయం పెంచుకోవడం, అధునాతన ఆయుధాలను ప్రయోగించడంలో ఉమ్మడి అనుభవం సంపాదిస్తున్నాయి.