India vaccination: కరోనా టీకా పంపిణీలో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. కోటి మందికిపైగా టీనేజర్లకు టీకా మొదటి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన మూడు రోజులకే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు పిల్లలకు మొత్తం 1,24,02,515 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
బుధవారం ఒక్కోరోజే మొత్తం 82,26,211 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. అందులో 37,44,635 డోసులను టీనేజర్లు అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న యువతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా అభినందించారు. టీకా తీసుకున్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైనవారు వీలైనంత త్వరగా టీకాలు అందుకోవాలని సూచించారు. అలాగే రోజువారీగా అందిస్తున్న వ్యాక్సిన్ల సంఖ్య పెరుగుతుందని భావించారు.
దేశంలో కరోనా టీకా పంపిణీ దశలవారీగా జరుగుతోంది. తొలి దశను 2021 జనవరి 16న కేంద్రం ప్రారంభించింది. ఈ దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు అందించారు.