వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణదారులు, కొనుగోలుదారులకు మధ్య సహేతుకమైన ఏకరూప ఒప్పందం (Builder Buyer Agreement) ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు (SUPREME COURT NEWS) అభిప్రాయపడింది. సామాన్య ప్రజలకు తెలియని అనేక క్లాజులను అందులో పెట్టడానికి విక్రేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని జస్టిస్ డీపై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాననం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
"నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు మధ్య సహేతుకమైన ఒప్పందం ఉండాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల పరిరక్షణలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కొనుగోలు చేసే వారు సామాన్యులు అయితే చట్టంలో వారికి తెలియని ఎన్నో క్లాజ్‌లను అందులో ఉంచేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఒప్పందాలు ఒకే తీరుగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశం వృద్ధిని సాధించడంలో ఇది చాలా ముఖ్యం."
- సుప్రీంకోర్టు
ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలు అమలు చేస్తున్న సేల్ అగ్రిమెంట్లకు బదులు దేశవ్యాప్తంగా.. కేంద్రం మోడల్ అగ్రిమెంట్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఈమేరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్స్ యాక్ట్ (Real Estate Regulation Act) అవగాహన ఉన్న వారికి మాత్రమే దీని ప్రాముఖ్యం తెలుస్తుందని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం మోడల్ ఒప్పందాన్ని (Model Sale Agreement) అమలు చేస్తున్న వివిధ రాష్ట్రాల్లో.. కొంతమంది బిల్డర్లు పరిస్థితులను ప్రభావితం చేయడానికి ఒప్పందంలో అనేక క్లాజులను చేరుస్తున్నారని వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే ఒప్పందం అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో గృహవిక్రేతల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మనేక గురుస్వామి మోడల్ అగ్రిమెంట్ అమలుకు తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వికాస్ సింగ్ వాదనతో తామూ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, సంబంధీకులకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి:ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ అదుర్స్- రెండు రెట్లు వృద్ధి!