గోవా, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గోవాలో 40స్థానాలకు ఓటింగ్ జరగగా సాయంత్రం ఐదు గంటల వరకు 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. కోతంబిలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్ని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న.. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలైగోవా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.37 శాతం నమోదైంది. గోవా, ఉత్తరాఖండ్‌లో చలిని సైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు ప్రజలు. ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎం..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, ఆయన సతీమణి గీత ఖతిమాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఆ సమయంలో వీరు కాషాయ కండువాలను ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కండువాలపై భాజపా గుర్తు కమలం పువ్వు కూడా ఉంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి సీఎం దంపతులు భాజపా కండువాలు ధరించి ఓటు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక, ఓటు వేసిన అనంతరం సీఎం సతీమణి పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తూ కనిపించారు.
ఇక ఉత్తర్‌ప్రదేశ్ రెండో దశలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం ఐదు గంటల వరకు 60.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ పూర్తయింది.