Girl Fell In Borewell In Madhya Pradesh :మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో నాలుగేళ్ల బాలిక పొలంలో ఉన్న 30 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం బోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో జరిగిందీ ఘటన.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్‌గఢ్ ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. బాలికను రక్షించేందుకు జేసీబీ, ఇతర పరికరాలను రప్పించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని బోరుబావి లోపల చిక్కుకున్న చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు.
నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోవడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. 'ఎస్డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం బాలికను సురక్షితంగా బోర్వెల్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ఏ అవకాశాన్ని వదులుకోము' అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Chhattisgarh Borewell Operation :కొన్నాళ్ల క్రితం బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహును దాదాపు 104 గంటల శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు. అందులో ఒక సీనియర్, ఇద్దరు ఇద్దరు జూనియర్ వైద్యులు ఉన్నారు.
జరిగింది ఇదీ..
ఇంటివద్ద ఆడుకుంటూ.. వెళ్లి బోరు బావిలో పడిపోయాడు రాహుల్. ఈ సంఘటన జాంజ్గీర్ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిహరీద్ గ్రామంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు.