ఫ్రెడా హౌల్‌స్టన్(Freda Houlston)... ఇంగ్లాండ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తాను 1929 సమయంలో ఆక్స్‌ఫర్డ్‌లో మాస్టర్స్ చదవటానికి చేరింది. తొలిసారిగా భారత్ గురించి భారతీయ విద్యార్థుల చర్చల్లో వింది. భారత్‌లో తమ బ్రిటిష్ వారు చేస్తున్న అకృత్యాలు తెలిసివచ్చాయి. అక్కడే బాబా ప్యారేలాల్ బేడీ(బీపీఎల్) అనే సిక్కు విద్యార్థితో ఫ్రెడాకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఓ బ్రిటిష్ అమ్మాయి భారతీయుడిని ఇష్టపడటం ఆక్స్‌ఫర్డ్‌లో సంచలనం సృష్టించింది. ఓసారి బీపీఎల్‌ను కలవటానికి ఒంటరిగా వెళ్లినందుకు ఫ్రెడాపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది ఆక్స్‌ఫర్డ్! ఎందుకంటే అప్పటి పద్ధతుల ప్రకారం ఆడ, మగ విద్యార్థులు ఏకాంతంగా కలవాలంటే యూనివర్సిటీ ఒకరిని తోడుగా పంపించేది. ఈ నిబంధనను ఫ్రెడా జాత్యహంకారంగా అభివర్ణించి ఉల్లంఘించింది.
చీరకట్టుతో భారత్‌లో..
తెల్లజాతీయురాలైన ఫ్రెడా(Freda Houlston) భారతీయుడిని ప్రేమించటాన్ని బ్రిటిషర్లుగానీ, వారి కుటుంబ సభ్యులుగానీ జీర్ణించుకోలేకపోయారు. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ పరీక్షలకు ముందే బీపీఎల్‌ను పెళ్లాడింది ఫ్రెడా! "జాతి, రంగు, దేశాల అంతరాలను కాదని.. న్యాయం, స్వేచ్ఛల కోసం జరిగిన వివాహం మాది" అంటూ ప్రకటించిన ఫ్రెడా చీరకట్టుతో భారత్‌లో అడుగుపెట్టడానికి ఇష్టపడింది. లాహోర్‌లో ఉంటూ... వర్తమాన భారత్ అంటూ ఓ త్రైమాసిక పత్రిక ఆరంభించారు వీరిద్దరూ! రెండో ప్రపంచయుద్ధ సమయంలో చాలామంది భారతీయులను సైన్యంలోకి చేర్చుకొని యుద్ధంలోకి పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. దీన్ని బీపీఎల్ అడ్డుకోవటంతో ఆయన్ను జైల్లో పెట్టారు. మహాత్ముడి ఆశీస్సులతో ఫ్రెడా సత్యాగ్రహిగా మారి జాతీయోద్యమంలోకి నేరుగా అడుగుపెట్టారు. బీపీఎల్ సొంత ఊరికి వెళ్లి అక్కడ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
'భారతీయురాలిగానే చూడండి'