ED Raids In Rajasthan :శాసనసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పేపర్ లీకేజీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ దాడులు నిర్వహించింది.
గతంలో రాజస్థాన్ విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గోవింద్ సింగ్‌కు చెందిన శికర్, జయపురతోపాటు మహువాలో కాంగ్రెస్ అభ్యర్థి ఓంప్రకాశ్ హుడ్లా, మరికొందరు నేతల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. జూన్‌లో ఈ కేసుకు సంబంధించి మొదటిసారి రాజస్థాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు.. బాబూలాల్ కటారా, అనిల్‌కుమార్ మీనా అనే ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.
సీఎం కుమారుడికి సమన్లు
ED Summons Rajasthan CM Son : మరోవైపు, రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.
'అందుకే బీజేపీ ఎర్ర గులాబీలు పంపిస్తోంది'
అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. "అక్టోబరు 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ఇలా 'ఎర్ర గులాబీలు' పంపిస్తోందని నేను చాలా సార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి" అని గహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.