ఉప్పు నిప్పు కణికగా మారి ఉవ్వెత్తున ఎగసిన తరుణమది. స్వాతంత్య్ర కాంక్షతో జాతి జనులు 'దండి'గా కదిలిన క్షణమది. ఉప్పు పన్నుపై పోరాటాలా? అంటూ కనుబొమ్మలు చిట్లించిన వారికి నోటమాట లేకుండా చేసిన ఉద్యమం అది. అదే దండి సత్యాగ్రహం. 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమంలో సత్యాగ్రహ యాత్రను ప్రారంభించిన మహాత్ముడు.. ఏప్రిల్ 6న అరేబియా సముద్ర తీరంలోని దండిలో పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకుని.. బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహోజ్వల ఘట్టమిది. ఈ చారిత్రక ఉద్యమానికి మంగళవారం(రేపటి) తో 91 ఏళ్లు. యావద్దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా.. నాటి 'దండి సత్యాగ్రహం'పై ఈనాడు అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఉప్పే నిప్పు కణిక
స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వపరిపాలన, స్వీయ నిర్ణయాలు.. ఇలాంటి పెద్దపెద్ద మాటలు సామాన్యుడికి ఏం అర్థమవుతాయి?
కానీ ఈ మహోన్నత లక్ష్యాలను అందుకోవాలంటే అదే సామాన్యుడు పోరాటం చేయక తప్పదు. మరి వారిని కార్యోన్ముఖుల్ని చేయాలంటే
ఏం చేయాలి?.. ఇవీ మహాత్మా గాంధీ మదిని తొలుస్తున్న ఆలోచనలు..!
ఆ కార్యసాధకుని కళ్ల ముందు కనిపించింది అద్భుత ఆయుధం.. సాధారణ ఉప్పు.
ఆ ఉప్పునే నిప్పు కణికగా మార్చి పోరు బాటన సాగడానికి మహాత్ముడు వ్యూహం రచించారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్నును భారీగా పెంచింది. దాని తయారీపైనా ఆంక్షలు పెట్టింది.
మన నోట్లో మట్టికొట్టే ఈ నిర్ణయం ఒక్కటి చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు వద్దో ప్రజలకు తెలియజెప్పడానికి!
పోరులో వారిని భాగస్వాములను చేయడానికి!!
ఉప్పు సత్యాగ్రహం ప్రస్తావన లేని భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను ఊహించడం కష్టమే. బ్రిటిష్ వారిని దేశం విడిచిపెట్టేలా చేసేందుకు పునాది రాయి పడింది ఈ సత్యాగ్రహంలోనే. దీనికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాలు ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ఆ మహోజ్వల ఘట్టాన్ని మరోసారి స్మరించుకుందాం.
లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్)లో రావీ నది ఒడ్డున జరిగిన కాంగ్రెస్ సమావేశంలో 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి నూతనంగా రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినాన్ని పాటించాలని ఆ సభల్లోనే జవహర్‌లాల్ నెహ్రూ పిలుపునిచ్చారు. బ్రిటిష్ చట్టాలను పాటించబోమంటూ ప్రజలు శాసనోల్లంఘన చేసేలా ఉద్యమానికి రూపకల్పన చేసే బాధ్యతలు మహాత్మునికి అప్పగిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది.
బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి అర్ధశతాబ్దం కిందట అంటే 1882లో 'సాల్ట్ యాక్ట్' (ఉప్పు చట్టం) చేసింది. దీని ప్రకారం భారతీయులెవరూ ఉప్పు తయారు చేయడానికి వీల్లేదు. బ్రిటిషువారు ఏర్పాటుచేసిన డిపోల వద్దే కొనుగోలు చేయాలి. దీనిపై పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి మొత్తం పన్ను ఆదాయంలో 8.2% దీని ద్వారా లభించేది. దాంతో గంజే కాదు, ఉప్పూ లేని దుస్థితి దేశవాసులది. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించారు. నెహ్రూ తటస్థంగా ఉండిపోయారు. భూమి శిస్తుపై పోరాటాలు చేస్తే మంచిదని పటేల్ సూచించారు. ఉప్పు పన్నుపై పోరాటాలు ఏమిటని పత్రికలు పెదవి విరిచాయి. 'ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఉండదు' అంటూ అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ లండన్‌లోని పెద్దలకు లేఖ రాశారు.
కదిలిన తెల్ల నది
ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేస్తారని ఫిబ్రవరి 5న పత్రికల్లో వార్తలు వచ్చాయి. 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమంలో ప్రారంభించి ఏప్రిల్ 6న అరేబియా సముద్ర తీరంలోని దండిలో పిడికెడు ఉప్పును పట్టుకోవడం ద్వారా చట్టాలను ఉల్లంఘించడానికి కార్యాచరణ సిద్ధమయింది. ఏప్రిల్ 6న ఎందుకంటే.. 1919లో అదే రోజున రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశ వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అరాచక, విప్లవ కార్యక్రమాల నిరోధక చట్టంగా వ్యవహరించే ఈ చట్టం కింద ఎవరినైనా అరెస్టు చేసి ఎలాంటి విచారణ లేకుండా ఎంతకాలంపాటైనా నిర్బంధించే అవకాశం ఉంది. స్వాతంత్య్ర సమరంలో ఇది కీలకఘట్టం కావడంతో ఆ రోజును గుర్తుచేస్తూ ప్రణాళిక రూపొందించారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న తన 78 మంది అనుచరులతో పాదయాత్రను ప్రారంభించారు. అందరూ తెల్లని ఖద్దరు ధరించడంతో ఇది ‘తెల్లని నది ప్రవాహం’లా ఉందన్న ప్రశంసలు అందుకొంది. మధ్యలో వేల మంది తోడయ్యారు. 48 గ్రామాల మీదుగా యాత్ర సాగింది.
సూర్యోదయ సమయంలో
ఏప్రిల్ ఆరో తేదీ ఉదయం 6.30 గంటలకు మహాత్ముడు దండిలో పిడికెడు ఉప్పును పట్టుకొని బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే ఆయన పాదయాత్ర ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ఎంతో మంది పాత్రికేయులు అక్కడికి చేరుకున్నారు. న్యూస్ రీళ్లూ తీశారు. దాదాపు అర లక్ష మంది ప్రజలు వచ్చారు. ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజనతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ పిడికెడు ఉప్పును గాంధీయే వేలం వేశారు. రూ.1,600 పలికింది. (అప్పటి ధరల ప్రకారం 750 డాలర్లు). అక్కడ నుంచి తీర ప్రాంతం వెంబడి ప్రతి గ్రామంలో స్వాతంత్య్ర ఉద్యమం ప్రాధాన్యం వివరిస్తూ ముందుకు సాగారు. ధరసనలోని ఉప్పు కర్మాగారం వద్ద సత్యాగ్రహం జరపాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో అక్కడికి బయలుదేరారు. పరిస్థితులను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం మే 4-5 తేదీల అర్ధరాత్రి మామిడి తోటలో నిద్రిస్తున్న గాంధీజీని అరెస్టుచేసి పుణె జైలుకు పంపించింది.
ఆందోళన చేస్తే ఎలాగైనా అణచివేయవచ్చు. అహింసావాదులతో ఎలా వ్యవహరించాలో అర్థం కావడం లేదు.- విలియం వుడ్జ్‌వెడ్ బెన్, భారత వ్యవహారాల విదేశాంగ మంత్రి. (ఉప్పు సత్యాగ్రహంపై)