కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి యావత్ దేశం అల్లాడిపోయింది. ఈ దశలో యువకులు ఎక్కువగా వైరస్‌కు ప్రభావితమైనట్లు వార్తలు వచ్చాయి. రానున్న రోజుల్లో చిన్నారులపై వైరస్ ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో కీలకమైన మాస్కులను చిన్నారులు ధరించవచ్చా? లేదా?అనే అంశంపై కొందరు తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో పిల్లలు మాస్కు ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ప్రకారం..
- 5 ఏళ్లలోపు చిన్నారులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.
- 6-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు మాస్కులను సురక్షితంగా వాడగలిగే సామర్థ్యాన్ని బట్టి ధరించవచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో ఈ వయసు పిల్లలు మాస్కులు ధరించడం మంచిది.
- ఇక 12-17 ఏళ్ల వయసున్న వారు మాత్రం పెద్దవారి మాదిరిగానే తప్పకుండా మాస్కులు ధరించాలి.
- మాస్కులను వాడే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవడం, లేదా శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం తప్పనిసరి.
డబ్ల్యూహెచ్ఓ, సీడీసీ ఏం చెబుతున్నాయి..?
పిల్లలు మాస్కు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదివరకే మార్గదర్శకాలను వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సూచించింది. అయితే, సురక్షితంగా వినియోగించగలిగిన సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సమీపంగా వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో మాత్రం మాస్కును వాడాలని స్పష్టం చేసింది. ఇక అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) మాత్రం కేవలం రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు మాత్రమే మాస్కులు వాడకూడదని పేర్కొంది.
ఇదిలాఉంటే, చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స అందించడంపై డీజీహెచ్‌ఎస్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్ సీటీస్కాన్ (HRCT)ను అంతగా వినియోగించాల్సిన పనిలేదని.. అత్యవసరమైతే దీనిని హేతుబద్ధంగా ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పిల్లలు తప్పకుండా పాటించాలని సూచించింది.
ఇదీ చదవండి :No mask: ఒక్కడోసు తీసుకున్నా మాస్కు అక్కర్లేదు!