CBSE 12th result 2023 : విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల ఫలితాలు వచ్చేశాయ్. శుక్రవారం ఉదయం 12వ తరగతి, మధ్యాహ్నం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది బోర్డు. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ సారి కూడా మెరిట్ కార్డులను ప్రకటించలేదు బోర్డు. విద్యార్థుల మధ్య ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో.. మెరిట్ లిస్టులను ప్రకటించడం లేదని వివరించింది. రెండు తరగతుల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు.
12వ తరగతిలో 87.33 శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది 12 వ తరగతిలో మొత్తం 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు తెలిపింది. 99.91 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం అగ్రస్థానంలో నిలవగా.. ప్రయాగ్ రాజ్‌లో అత్యల్పంగా 78.05శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొంది. వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 5.38 శాతం ఉత్తీర్ణత తగ్గిందని చెప్పింది. 90.68 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారని.. అబ్బాయిల కంటే 6.01 శాతం అధికమని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు హాజరయ్యారు.
10వ తరగతిలో 93.12 శాతం ఉత్తీర్ణత
శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 93.12 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గతేడాది కంటే ఇది 1.28 శాతం తక్కువని సీబీఎస్‌ఈ తెలిపింది. అబ్బాయిలపై మరోసారి పైచేయి సాధించారు అమ్మాయిలు. అబ్బాయిలు 92.27 శాతం సాధించగా.. అమ్మాయిలు 94.25 శాతంతో మెరుగైన ఫలితాలు సాధించారు. మరోవైపు వచ్చే ఏడాది జరగబోయే 10,12 తరగతులు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది సీబీఎస్‌ఈ. 2024 ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఎగ్జామ్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
- సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- యాక్టివ్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ డిస్‌ప్లే అవుతుంది.
- మీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- మీరు సాధించిన స్కోరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఆ కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.