జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం దేశ సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా శాంతి భద్రతల దృష్ట్యా భారత్-పాక్‌లకు పలు సూచనలు చేశాయి ఐక్యరాజ్యసమితి, అమెరికాలు.
శాంతియుతంగా ఉండండి..
జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపుతప్పకుండా భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరుదేశాలకు విజ్ఞప్తి చేశారు.
కొద్ది రోజులుగా నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితి సైనిక పర్యవేక్షక బృందాలు గమనించాయని ఐరాస అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు ప్రాంతం అయిన జమ్ము కశ్మీర్‌తో పాటు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రెండు దేశాలు ఉల్లంఘించాయని పేర్కొన్నారు.
కశ్మీర్ అంశంపై అమెరికా నిఘా
కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. నియంత్రణ రేఖ వద్ద అంతా సంయమనం పాటించాలని పాక్ పేరు ప్రస్తావించకుండా విజ్ఞప్తి చేసింది.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పాక్ వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రకటన చర్చనీయాంశమైంది. జమ్ముకశ్మీర్‌పై ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా తమ అంతర్గతమని భారత్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఒర్టాగస్. మానవ హక్కులకు భంగం కలిగించకుండా నిర్ణయాలు ఉండాలని భారత్‌కు సూచించినట్లు తెలిపింది.
అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనలపై ప్రభుత్వ నిర్ణయాన్ని.. ఇప్పటికే పీ-5 దేశాల (అమెరికా,బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా) రాయబారులకు వివరించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.
ఇదీ చూడండి: అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్