రిపబ్లిక్ డే రోజున దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో జాతీయ జెండాకు జరిగిన అవమానం చూసి యావత్ దేశం విస్తుపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ రేడియా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందన్నారు.
2020 ఏడాది దేశం ఎంతో సంయమనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి అనేక సవాళ్లను ఎదుర్కొందని మోదీ అన్నారు. కొత్త ఏడాదిలో కూడా అదే తరహాలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్ధితుల్లో భారత్ ప్రపంచానికే ఆశాజ్యోతిగా మారిందని, కరోనా టీకా పంపిణీ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. 15 రోజుల్లోనే 30లక్షల మందికి టీకా అందించి భారత్ రికార్డు సృష్టించిందని తెలిపారు. భారత్‌లో తయారీలో భాగంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌లు దేశ ఆత్మ నిర్భరతకు, ఆత్మ విశ్వాసానికి ప్రతీకలుగా మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.