ఆమె 20 వారాల గర్భిణి.. కడుపులో శిశువుకు గుండె సంబంధ సమస్య ఉన్నట్లుగా స్కానింగ్‌లో నిర్ధారణయింది. బిడ్డ పుట్టినా బతికే అవకాశాల్లేవని తేలింది. గర్భస్రావం చేయించుకోవాలని వైద్యురాలిని సంప్రదిస్తే.. ఐదు నెలలు దాటాక చట్టం అంగీకరించదని నిస్సహాయతను వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేగానీ సాధ్యంకాలేదు.
అలాగే వసతిగృహంలో చదువుకుంటున్న 14 ఏళ్ల బాలిక ఓ కామాంధుడి మాయమాటలకు మోసపోయి గర్భం దాల్చింది. విషయాన్ని 20 వారాలు గడిచాక గానీ ఇంట్లో గుర్తించలేకపోయారు. అప్పుడు గర్భస్రావానికి వైద్యులు నిరాకరించారు. ఇక్కడ కూడా న్యాయస్థానం జోక్యం చేసుకొని అంగీకారం తెలిపింది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా స్త్రీ వైద్యనిపుణులు చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. గర్భం దాల్చడాన్ని వివాహిత ఎంతో అపురూపంగా భావిస్తుంది. గర్భస్రావ ప్రస్తావననే ఆమె ఇష్టపడదు. తల్లికి గానీ, బిడ్డకు గానీ ముప్పు ఉందని తేలినప్పుడు.. తప్పనిసరైతే ఆరో నెలలోనూ గర్భవిచ్ఛిత్తికి త్వరలో అవకాశం లభించబోతోంది. దీనికి సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకూ ఐదు నెలలలోపే ఇందుకు అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా మలచుకొని కొందరు గర్భస్రావం చేయించుకునే దుర్మార్గపు వ్యవహారాలకు వీలుండడం వల్ల చట్టంలో తగిన కట్టుబాట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకీ సవరణ?
సాధారణంగా 11-14 వారాల్లో చేసే స్కాన్‌లో గర్భస్థ శిశువు వెన్నుపూస, మెదడులో లోపాలుంటే తెలుస్తుంది. మెదడు వెనుక ఉండే భాగంలో వాపు మాదిరిగా ఉంటే.. జన్యుపరమైన, గుండె సంబంధిత సమస్యలుండే అవకాశాలుంటాయి.
మరో రక్త పరీక్ష ద్వారా కూడా వీటిని నిర్ధారిస్తారు.
కొన్నిసార్లు ఈ సమస్యలు 16-20 వారాల్లో జరిపే పరీక్షల్లో బయటపడతాయి. అప్పుడు నిర్ధారణ కోసం మరికొన్ని పరీక్షలను చేయాల్సి వస్తుంది. ఈ ఫలితాలు రావడానికి కనీసం నాలుగు వారాలు పట్టొచ్చు.