జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుతో రాష్ట్ర రాజ్యాంగంలోని ఆర్టికల్ 35-A కూడా రద్దవుతుంది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగానూ విభజించారు. ఈ కేంద్ర నిర్ణయంతో అక్కడ ఎన్నో మార్పులు రానున్నాయి. మొదటగా.. జమ్ముకశ్మీర్ అధికారిక జెండాను శాశ్వతంగా తొలగించనున్నారు. ఇప్పటివరకు ఆర్టికల్ 370 కల్పించే ప్రత్యేక అధికారాలతో జమ్ముూలో భారత జాతీయ జెండాతో పాటు.. రాష్ట్ర అధికారిక జెండాను ఎగురవేసే అధికారం ఉంది.
అయితే.. ఆగస్టు 5న ఈ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా... త్వరలోనే తమ రాష్ట్ర జెండాపై కశ్మీర్ పూర్తి అధికారం కోల్పోనుంది. నివేదికల ప్రకారం శ్రీనగర్ సెక్రటేరియట్ భవనంలో భారత త్రివర్ణ పతాకంతో పాటుగా ఎరుపు రంగుతో నాగలి గుర్తు, 3 నిలువు గీతలతో ఉండే తమ అధికారిక పతాకాన్ని ఇప్పటికీ ఎగురవేస్తున్నారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ నిర్మల్ సింగ్.. తన అధికారిక వాహనంపై రాష్ట్ర జెండాను తొలగించిన తొలి చట్టసభ సభ్యునిగా నిలిచారు. జెండా శాశ్వత తొలగింపు అంశంపై త్వరలోనే ప్రకటన జారీ చేసే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు.
500 మందికి పైగా నిర్బంధంలోనే...
అధికరణ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన అనంతరం.. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పలువురు రాజకీయ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.