'భాజపా సభ్యత్వ నమోదు'కు మోదీ నేడు శ్రీకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
అక్కడి నుంచే దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు ప్రధాని. భారతీయ్ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని... ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనుంది భాజపా.
లోక్‌సభ ఎన్నికల్లో విజయం అనంతరం.. మోదీ ఇక్కడ పర్యటించనుండటం ఇది రెండోసారి. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు మే 27న వారణాసి వెళ్లారు ప్రధాని.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్ నాయక్ వారణాసి విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఎల్బీ శాస్త్రి విగ్రహావిష్కరణ...
పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభానికి ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మోదీ. మొదట స్థానిక విమానాశ్రయంలో మాజీ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశమవనున్నారు.
అనంతరం 'ఆనంద్ కానన్' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. తర్వాత బడా లాల్పుర్లోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ సెంటర్లో 5 వేల మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అక్కడే.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రధాన మంత్రి. పార్టీలో చేరనున్న వారికి సభ్యత్వాన్ని అందజేస్తారు.