బంగాల్లో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంతరాయం కలిగించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా నేతలపై ఆదివారం జరిగిన దాడులకు నిరసనగా 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది కాషాయ పార్టీ. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు భాజపా కార్యకర్తలు.
దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు భాజపా కార్యకర్తలు. లాకుర్తి, బారక్పుర్-బరాసట్ రహదారి, హావ్డాలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనల్లో పోలీసులతో పాటు కార్యకర్తలు గాయపడ్డారు.
ఆదివారం జరిగిన ఘటనలో గాయపడ్డ బారక్పుర్ ఎంపీ అర్జున్ సింగ్ను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కలిశారు. పరామర్శ అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్.