సంకీర్ణాల శకానికి ముందూ ఆయనే.. తర్వాతా ఆయనే! సంస్కరణల పథానికి ముందూ ఆయనే.. తర్వాతా ఆయనే! కాంగ్రెస్‌లో, యూపీఏలో అన్నీ ఆయనే! పార్టీ అధ్యక్షుడు కాదు.. ప్రభుత్వ సారథి అంతకన్నా కాదు. కానీ అన్నీ ఆయనే! అన్నింటా ఆయనే!
అవును.. 1970 తర్వాత భారత అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ లేని పేజీ ఉండదు. సమన్వయం అవసరమయితే గుర్తొచ్చింది ప్రణబ్‌దానే. సంక్షోభం ఎదురయినప్పుడు పిలిచింది ఆయన్నే. రాజకీయాల్లో కుడి, ఎడమలను సమన్వయం చేసుకున్న సవ్యసాచి కార్యదక్షతకు, రాజనీతిజ్ఞతకు మారుపేరు.. మన భారతరత్నం ప్రణబ్‌దా. ఆయన మరణంతో దేశం శిఖరసమానమైన నాయకుడిని కోల్పోయింది.
తుదిశ్వాస
భారత రాజకీయ మార్తాండుడు, 13వ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ (84) అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. అర్ధశతాబ్దంపాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కర్మయోగి మృత్యువు ఒడిలో ఒదిగిపోయారు. ఇంట్లో కిందపడి మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా అనారోగ్యానికి గురై ఆగస్టు 10న దిల్లీ ఆర్మీ రీసెర్చ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరిన ఆయన మళ్లీ బాహ్యప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూశారు.
ఆసుపత్రిలో చేరిన రోజే ఆయనకు డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం పరీక్షలు చేసినప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత బాగానే ఉన్న ఆయన క్రమంగా కోమాలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. 21రోజులపాటు ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రకటించారు.
"మా తండ్రి ప్రణబ్‌ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని బరువెక్కిన హృదయంతో పంచుకుంటున్నా. ఆర్‌ఆర్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతగా శ్రమించినా, దేశవ్యాప్తంగా అభిమానులు ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం దక్కలేదు." అని అభిజిత్ ఆవేదనతో పేర్కొన్నారు.
ఏడు రోజులు సంతాప దినాలు
ప్రణబ్‌ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సోమవారం ఉదయమే ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆదివారం ఆయన సెప్టిక్‌షాక్‌తో బాధపడ్డారని, సోమవారం సాయంత్రం 4.30కు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారని తెలిపింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీనేత రాహుల్‌గాంధీతోపాటు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులను సంతాపదినాలుగా ప్రకటించింది. ఈనెల 6వ తేదీవరకు దేశవ్యాప్తంగా జాతీయ పతకాన్ని అవనతం చేయనున్నట్లు తెలిపింది. అధికారికంగా ఎటువంటి వినోదకార్యక్రమాలూ ఉండబోవని పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు లోధీ రోడ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రణబ్ కుటుంబం వెల్లడించింది.
2015లో భార్య మృతి
ప్రణబ్ సతీమణి సుర్వాముఖర్జీ అనారోగ్యంతో 2015 ఆగస్టులోనే మరణించారు. వారిద్దరి దాంపత్యజీవితం 58 ఏళ్లు సాగితే, ఆయన రాజకీయ జీవితం 51 ఏళ్లపాటు కొనసాగింది. ఆయనకు కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్‌లో ఉన్నారు. మరో కుమారుడు ఇంద్రజిత్ ముఖర్జీ వ్యాపారాలు చేస్తున్నారు.
ప్రముఖుల విచారం
ముఖర్జీ మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు సంతాపం తెలిపారు.
"ప్రణబ్ ప్రజా జీవితంలో అత్యున్నత ప్రమాణాలు పాటించిన వ్యక్తి. మహోన్నత కుమారుడిని కోల్పోయిన దేశం శోకిస్తోంది. ఆయన మరణంతో ఓ శకం ముగిసిపోయింది."
-రాష్ట్రపతి కోవింద్
భారత మాత ప్రియ పుత్రుడు
ప్రణబ్ ముఖర్జీ భారతమాత ప్రియపుత్రుడు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో దేశ రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయుడు. సుదీర్ఘమైన ప్రజా జీవితంలో చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. అసాధారణ జ్ఞాపకశక్తి సంపన్నుడు. సమస్యను భిన్న కోణాల్లో విశ్లేషించగల నేర్పరి. ప్రణబ్ మృతితో దేశం మరో అత్యున్నత నాయకుడిని కోల్పోయింది.
-ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
"దేశ అభివృద్ధి పథంలో ప్రణబ్ ముఖర్జీ స్థానం చిరస్మరణీయమైనది. మహా జ్ఞాని, రాజనీతిజ్ఞుడు. రాజకీయ పార్టీలకతీతంగా అందరికీ స్ఫూర్తి ప్రదాత." -ప్రధాని మోదీ
"ప్రణబ్ ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం సమకాలీన దేశ చరిత్రకు నిలువుటద్దం. ఆయన జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ చిరకాలం పదిలపరుచుకుంటుంది." -సోనియా గాంధీ
గొప్ప నేతను కోల్పోయాం
"స్వతంత్ర భారతదేశ గొప్ప నేతల్లో ఒకరైన ప్రణబ్ ముఖర్జీని దేశం కోల్పోయింది. పాలనా వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఆయన, నేను కలిసి పనిచేశాం. ప్రణబ్‌కున్న అపార జ్ఞానం ఎన్నో విషయాల్లో ఆయనపై నేను ఆధారపడేలా చేసింది."
-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
అదే నాకు దక్కిన గౌరవం
ప్రణబ్ మృతిపై తీవ్ర విచారం కలిగింది. భారత ఆర్థిక చరిత్రపై ఆయన విజ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతం. చాలా చురుకైన వ్యక్తి. నిజమైన రాజకీయవేత్త. ఆయనతో సంయుక్త కార్యదర్శిగా బడ్జెట్ సమయంలో పనిచేయడం నిజంగా నాకు దక్కిన గౌరవం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
- ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఫిక్కీ సంతాపం
భారత ఒక అత్యంత గొప్ప వ్యక్తిని కోల్పోయింది. పార్టీలకతీతంగా ఆయన్ని అందరూ ఇష్టపడేవారు. భారత పరిశ్రమకు మద్దతుదారుగా ఉన్న ప్రణబ్ మృతిపై ఫిక్కీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
- సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ
మాస్ లీడర్ కాదు... మహా మేధావి
50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భారత ప్రజాస్వామ్య ఎత్తుపల్లాలను చూసిన అత్యంత అరుదైన నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ. మాస్ లీడర్ కాకపోయినా భారతరాజకీయాలపై స్పష్టమైన పట్టు సాధించిన మేధావి. కాంగ్రెస్ ఉత్థానపతనాలను దగ్గర నుంచి చూసిన ఈ రాజకీయ బహుదూరపు బాటసారి 2012లో భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన అనుభవాలను పంచుకుంటూ రాసిన ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకాన్ని వచ్చే డిసెంబర్ 11న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నప్పటికీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు. ప్రణబ్ ట్విటర్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. కొవిడ్-19 సోకిందని ఆగస్టు 10న ట్విటర్‌ద్వారానే వెల్లడించారు. అదే ఆయన చివరి పోస్ట్. ప్రజలతో ఆయన చివరి మాటలు కూడా అవే.
జీవితాన్ని.. రాజకీయాలను ఈదిన నేత
ప్రణబ్‌ముఖర్జీ చిన్నతనంలో జీవితాన్ని, ఎదిగిన తర్వాత రాజకీయాలను ఈదారు. పశ్చిమబెంగాల్‌లోని చిన్న గ్రామం మిరాటిలో 1935, డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్.. తన జీవితంలో తొలి పాఠాలను స్వాతంత్య్ర సమరయోధులైన తల్లిదండ్రుల వద్ద నుంచి నేర్చుకున్నారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా పలుమార్లు జైలుకెళ్లారు. ప్రణబ్ రోజూ 10-12 కిలోమీటర్లు కాలినడకన పాఠశాలకు వెళ్లివచ్చేవారు. వర్షాకాలంలో వాగు ఈదుకుంటూ దాటి చదువుకున్నారు. అలాంటి స్థాయి నుంచి వచ్చిన ఆయన 2012లో దేశ అత్యున్నత అధికార నివాసమైన రైసినాహిల్స్‌లోని రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు. 1969లో కాంగ్రెస్‌నుంచి చీలి ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బ్యాంకుల జాతీయకరణ సమయంలో పార్లమెంటులో చేసిన ప్రసంగం ద్వారా ఇందిరాగాంధీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి పార్లమెంటరీ పార్టీ సభ్యుడు ఓం మెహతా ద్వారా పిలిపించుకొని అభినందించిన ఇందిరని అప్పటినుంచి అభిమానించడం మొదలుపెట్టారు. 1971లో జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆయన మధ్యలో మూడేళ్లు తప్ప మిగిలిన కాలం ఆపార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు.
కూటమిని దృఢంగా మలచిన శిల్పి
ప్రణబ్‌ముఖర్జీ యూపీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రితో సమానమైన గౌరవమర్యాదలు ఉండేవి. భారత దేశంలో మైనార్టీ ప్రభుత్వాలుకూడా స్థిరంగా నడవగలవని నిరూపించడంతో ఆయన పాత్ర అమోఘం. యూపీయే 1, 2 ప్రభుత్వాల్లో మిత్రపక్షాలను ఏకతాటిపై నిలబెట్టడంలో ఈయనదే కీలకపాత్ర. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా గొప్పపేరు సంపాదించారు. తొలినాళ్లలో చాలా పెళుసుగా కనిపించిన యూపీఏ కూటమిని దృఢంగా నిర్మించి 2009లో మంచి మెజార్టీతో గెలిచేలా చేయడంలో ప్రణబ్‌ముఖర్జీ పోషించిన పాత్ర అమూల్యం. 2004లో కాంగ్రెస్ గెల్చుకున్నది 145 సీట్లే. భాజపా 138 సీట్లతో దగ్గర్లోనే ఉంది. ఈ స్థితిలో కూటమిని బలంగా నిలపడంలో ప్రణబ్ కృషి ఎనలేనిది. మొత్తం ప్రభుత్వానికే మార్గదర్శనం చేసిన మూలస్తంభం ఆయన. మిత్ర పక్షాలను కలుపుకువెళ్లడంలో వాజ్‌పేయి తర్వాత విశ్వసనీయంగా కనిపించిన నేత ఈయనే అన్నది రాజకీయవర్గాల వ్యాఖ్య. ప్రతిపక్షాలనుకూడా సిద్ధాంతపరంగా తప్పితే వ్యక్తిగతంగా విమర్శించని నాయకుడు ఆయన. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా పదం తప్పుదొర్లినా క్షమాపణలు చెప్పేవారు. దేశ అభివృద్ధి చిత్రాన్ని మలచడంలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్.. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను తీర్చిదిద్దడంలోనూ ముఖ్య భూమిక వహించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న హెన్రీ కిసెంజర్‌తో 2004లో ప్రణబ్ భేటీ అయిన తర్వాత రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. అమెరికా-భారత్ రక్షణ సంబంధాల కొత్త ఒప్పందం 2005లో ప్రణబ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కుదిరింది.
"బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో మిణుకు మిణుకుమంటూ ఉండే దీపపు బుడ్డి నుంచి దిల్లీలో ధగధగలాడే షాండిలియర్స్ వరకు నేను చేసిన ప్రయాణంలో నమ్మశక్యంకాని మార్పులెన్నో చూశాను. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు బెంగాల్‌లో లక్షల మంది ప్రాణాలను తీసిన క్షామాన్ని చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో ఎంతో పురోగతి వచ్చింది. భవిష్యత్తు తరాల నాయకత్వంలో దేశం ఇంకా ఎంతో సాధిస్తుంది. ప్రజల భాగస్వామ్యమే మన దేశ అసలు విజయగాథ."
- ఓ ప్రసంగంలో ప్రణబ్
ఇందిర అంటే ఎంతో గౌరవం
ఇందిరాగాంధీని ఆయన ఎప్పుడూ ఆరాధించేవారనడానికి ఓ చిన్న ఉదాహరణ ఉంది. 2012లో దిల్లీలో అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలకడానికి వచ్చిన బాబారామ్‌దేవ్‌ను వారించడానికి యూపీయే ప్రభుత్వం విమానాశ్రయానికి మంత్రులను పంపడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. ఆ సమయంలో ఆయన్ను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ఇందిర ఫొటోవైపు చూపుతూ ఆమె ఉండి ఉంటే ఇలాంటివి జరిగేవి కాదని ఆవేదనతో వ్యాఖ్యానించారు. ఆమె నాయకత్వ పటిమపై అంత ప్రబల విశ్వాసం ఆయనకు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ రాజ్యాంగం, ప్రాథమికహక్కులకు గొప్పగా విలువనిచ్చే వ్యక్తి. ఆ సమయంలో ఇందిరాగాంధీతో పనిచేయడంవల్లే వాటి విలువను ఆయన మరింతగా తెలుసుకోగలిగారని ప్రతిపక్షాలు అంటుంటాయి.
రెండుసార్లు వెంటాడిన దురదృష్టం
1991లో పీవీనరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేంద్ర కేబినెట్ కూర్పులో ప్రణబ్‌ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కేబినెట్‌లో ఎవరు ఏ స్థానంలో ఉండాలో పేర్లన్నింటినీ ఆయనే తయారుచేసి పీవీకి ఇచ్చారని, అందులో ఆర్థిక మంత్రి పేరును ఒక్కటే ఖాళీగా ఉంచారని చెబుతారు. ఆ పదవికి ఎలాగూ తన పేరునే పిలుస్తారులే అన్న ధీమా ఆయనకు ఉండేదని బెంగాలీ పాత్రికేయులు పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా రాష్ట్రపతి భవన్ నుంచి తనకు పిలుపురాకపోవడంతో ఆయన హతాశులయ్యారని తెలిసినవారు గుర్తుచేసుకున్నారు. 2004లో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పుడు కూడా మళ్లీ మన్మోహన్‌సింగ్‌కే దక్కడం యాదృచ్చికమనుకోవాలి.