బంగాల్లో హింసాత్మక ఘటనలను పెరిగిపోతున్నాయంటూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు చేశారు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. రాజకీయ హత్యలు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో ప్రత్యేకత అని.., ప్రభుత్వ ప్రాయోజిత హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భాజపా కూడా హింసకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఖండించారు సుప్రియో.
" భాజపా ఎప్పుడూ దూకుడుగా ప్రవర్తించలేదు. బంగాల్ సహా దేశవ్యాప్తంగా 'సబ్కా సాత్, సబ్కా వికాస్' అనేదే మా సిద్ధాంతం. గత 10 ఏళ్లలో బంగాల్‌ను ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హింస వైపు నెట్టివేశారు. ప్రతిరోజు ఒకరు హత్యకు గురవుతున్నారు. మమతా బెనర్జీకి దీర్ఘాయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా. కానీ, ఆమె రాజకీయ జీవితం 2021లో ముగియబోతోంది. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాజపా అధికారం చేపడుతుంది. మంచి పాలనను అందిస్తుంది.
మమతా బెనర్జీ.. బంగాల్లో బాంబుల పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే.. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు రేషన్ కార్డులు అందించి తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్న వామపక్షాల మాదిరిగానే.. టీఎంసీ చేసింది. ఒకానొక సమయంలో పార్లమెంట్ సాక్షిగా బంగ్లాదేశీయులు బంగాల్‌కు ప్రమాదకరమని పేర్కొన్న మమత.. నేడు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు మమత బెనర్జీ మార్క్ రాజకీయానికి నిదర్శనం."
- బాబుల్ సుప్రియో, కేంద్ర మంత్రి.