దేశ రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వినూత్న పోకడల ద్వారా రాజ్యాంగాన్ని పటిష్ఠపరిచేందుకు ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. దేశ ప్రజల హక్కులను పరిరక్షించడంలోనైనా.. జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తినా.. న్యాయ వ్యవస్థ ప్రతిసారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని కొనియాడారు.
గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలకు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ప్రధాని మోదీ. గుజరాత్ హైకోర్టు నెలకొల్పి 60 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. దేశ సంస్కృతిలో 'సమన్యాయ పాలన' అనేది ప్రాథమిక సూత్రంగా పనిచేసిందని అన్నారు.
"శతాబ్దాలుగా.. దేశ సంస్కృతిలో 'సమన్యాయ పాలన' అనేది ప్రాథమిక సూత్రంగా వ్యవహరించింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని పటిష్ఠం చేసిన 'స్వరాజ్య'మనే భావన సైతం అక్కడి నుంచి ఉద్భవించింది. రాజ్యాంగకర్తలు కూడా దీనికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. భారత సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమన్యాయ పాలన.. ప్రతి పౌరుడి హక్కు. అందువల్ల ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను నెలకొల్పడం అవసరం. ఇది ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థల బాధ్యత."