తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నవ జంటను విడగొట్టిన పోటీ పరీక్షలు..! - మధ్యప్రదేశ్​లో చర్చనీయాంశం

ఓ భార్య వింత కారణంతో విడాకులు కోరడం మధ్యప్రదేశ్​లో చర్చనీయాంశంగా మారింది. భర్త పోటీపరీక్షలకు సన్నద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడన్న కారణంతో విడాకులకు దరఖాస్తు చేసింది ఆ సతీమణి. పీహెచ్​డీ పూర్తి చేసిన భర్త లక్ష్యాలు అర్థమయ్యాయో... లేదో.. కానీ కలిసి ఉండటం కుదరదని కోర్టు మెట్లెక్కింది.

నవ జంటను విడగొట్టిన పోటీ పరీక్ష...

By

Published : Sep 1, 2019, 11:39 AM IST

Updated : Sep 29, 2019, 1:27 AM IST

వైవాహిక జీవితం... అర్థం చేసుకొని మెదిలితే మమకారం... లేదంటే హాహాకారమే అని మరోసారి రుజువైంది. తమకు విడాకులు కావాలని కోరుతూ ఓ జంట తెలిపిన కారణం పలువురిని విస్తుపోయేలా చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడని ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కింది ఆ సతీమణి. తనను వదిలేసి వెళ్లినప్పటికీ... తిరిగి కలిసి ఉండాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన కారణంగా పీహెచ్​డీ చదివి ఉన్నతాధికారి కావాలనుకున్న ఆ భర్త సైతం విడాకులకు సై అంటున్నాడు.

జరిగింది ఇదీ...

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడికి కొద్ది రోజుల కిందటే వివాహం జరిగింది. రంగుల హరివిల్లు లాంటి జీవితాన్ని ఊహించుకుని అత్తింట అడుగుపెట్టింది ఆ సతీమణి. కానీ ఆ భర్త యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతూ... పుస్తకాలతో కుస్తీ పడుతుండటం ఆమెను నిరాశకు గురిచేసింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆ మహిళ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనను విన్న కోర్టు కౌన్సెలింగ్‌‌కు వెళ్లాలని సూచించింది.

కౌన్సెలింగ్​లో భార్య వాదన...

తన భర్త పీహెచ్‌డీ పూర్తి చేసి... యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని... అతనికి పెళ్లంటే ఇష్టం లేదని పేర్కొందని కౌన్సెలింగ్ చేస్తున్న న్యాయవాది తెలిపారు. కానీ అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లిదండ్రుల కోరిక మేరకు వివాహం చేసుకున్నాడని భార్య తెలిపినట్లు వెల్లడించారు. వివాహం అయినప్పటి నుంచి ఆమెను పట్టించుకోవడం మానేసి చదువుకే అంకితమయ్యాడని ఆరోపించిన మహిళ... తన భర్త ప్రవర్తనతో విసిగిపోయానని దయచేసి విడాకులు ఇప్పించమంటూ ప్రాధేయపడిందని పేర్కొన్నారు.

భర్త వివరణ...

తన సతీమణి తనను కాదని పుట్టింటికి వెళ్లిపోయిందని.. తనంటే ఇష్టం లేని అమ్మాయితో కలిసి ఉండడం కుదరదని చెప్పాడని సమాచారం. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపి భార్య నుంచి విడాకులు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశాడు.

దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి కుటుంబసభ్యులు, బంధువులూ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కోర్టు విచారణ ప్రారంభించే ముందు ఇరువురి మధ్య మరో నాలుగు సెషన్ల కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. మరి... కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి : పడవ పోటీల్లో మాస్టర్​ బ్లాస్టర్​ మెరుపులు

Last Updated : Sep 29, 2019, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details