హరియాణా సీఎం అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్ఖీ దాద్రీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన బహిరంగ ప్రసంగం ఇప్పుడు సంచలనంగా మారింది. స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే చేసిన తప్పు వల్లే దేశానికి స్వాతంత్రం రావడానికి 90 ఏళ్లు ఆలస్యమైందని ఖట్టర్ విమర్శించారు. ఆ వీడియోను ఆమ్ ఆద్మీ నేత నవీన్ జైహింద్ ట్విట్టర్లో పంచుకున్నారు.
"మంగళ్ పాండే 11 రోజుల ముందు తుపాకీ కాల్పులు జరిపి ఉండకుండా... మే10 వరకు వేచి ఉండి ఉంటే.. బహుశా 1857లోనే బ్రిటిష్ వారు పారిపోవాల్సి వచ్చేది. 90 ఏళ్ల క్రితమే మనం స్వతంత్రులమయ్యేవాళ్లం."
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
సీఎంపై విరుచుకుపడ్డ ఆప్ నేత
''ఇప్పుడు సీఎం ఖట్టర్ సారు, మంగళ్ పాండే తప్పిదం వల్లే స్వాతంత్య్రం 90 సంవత్సరాలు ఆలస్యమైందటున్నారు. ఇది మంగళ్‌పాండేను అవమానించినట్టే. మీ 7 తరాల చరిత్రలో ఎవరైనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లడినవారు ఉంటే చూపించండి ముందు. ఇప్పుడు మంగళ్ పాండే తూటాలు పేల్చడంపై విమర్శలు చేయడం తగునా''
-నవీన్ జైహింద్, ఆప్ నేత
నవీన్ జైహింద్ చేసిన ఈ పోస్టును కాంగ్రెస్ నేత దీపేంద్ర హుడ్డా రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే ఖట్టర్.. జమ్ము కశ్మీర్ అమ్మాయిలను హరియాణా యువకులు పెళ్లి చేసుకోవచ్చని బహిరంగంగా ప్రసంగించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
ఇదీ చూడండి:కశ్మీర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం.. ఖట్టర్ స్పందన